ధన్వంతరి జయంతి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ సారి దీపావళి ఎంతో ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. రోజ్గార్ మేళాలో భాగంగా ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు ధన త్రయోదశి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, మరో రెండ్రోజుల్లో ప్రత్యేకమైన దీపావళి జరుపుకోబోతున్నామని వ్యాఖ్యానించారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైనవేళ వచ్చిన తొలి దీపావళి ఇది అని వివరించారు. అనంతరం రోజ్ గార్ మేళాలో భాగంగా 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో నేడు రోజ్గార్ మేళా నిర్వహించారు. వివిధ మంత్రిత్వశాఖల్లో నియామకాలు చేపట్టి ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారందరికీ ‘కర్మయోగి ప్రారంభ్’ విధానం కింద శిక్షణ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మేళాలను నిర్వహించగా వైజాగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు.
ఆనంతరం ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం పట్ల ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.