గత రెండు వారాలుగా వరుసగా విమానాలకు వస్తోన్న బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్‌పై పోలీసులు పురోగతి సాధించారు. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలోని గోండియాకు చెందిన జగదీశ్..యూకీ అనే వ్యక్తి ఈ మెయిల్ ద్వారా బెదిరింపు మెయిల్స్ పంపినట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని నాగపూర్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ జగదీశ్ అనేక సార్లు బెదిరింపు కాల్స్, మెయిల్స్ చేసిన దాఖలాలున్నాయి. ప్రధాని కార్యాలయానికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీసుకు, కేంద్ర హోం మంత్రికి, పలువురు ప్రముఖులకు జగదీశ్ గతంలో బెదిరింపు మెయిల్స్ పంపాడు.దీనిపై కేసు నమోదైంది. గత రెండు వారాల నుంచి జగదీశ్ బెదిరింపు మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
తనకు తెలిసిన రహస్య ఉగ్రవాద కోడ్‌పై సమాచారం ప్రధానికి వెల్లడించేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ జగదీశ్ గతంలో పంపిన మెసేజ్‌లో వివరించాడు. ఉగ్రవాదుల బెదిరింపులపై ప్రధాని మోదీతో చర్చించేందుకు తనకు అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేశాడు. ఉగ్రవాదంపై జగదీశ్ ఒక పుస్తకం కూడా రాశాడని పోలీసులు తెలిపారు.
గడచిన రెండు వారాల్లో 300లకుపైగా బెదిరింపు కాల్స్, మెయిల్స్ విమానయాన సంస్థకు అందాయి. దీంతో దేశ వ్యాప్తంగా విమానప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు వాటిని దారి మళ్లించడం, తనిఖీలకు గంటల కొద్దీ సమయం పట్టడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెదిరింపు కాల్స్, మెయిల్స్‌ను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం, అలాంటి అరాచకాలు చేసిన వారికి జీవితఖైదు విధించేలా చట్టం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.