అయోధ్యలోని బాలరాముడి నూతన దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి దీపావళి జరగబోతోంది. ఆ పర్వదినాన్ని చిరస్మరణీయంగా జరుపుకోడానికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. 28 లక్షల దీపాలు వెలిగించడానికి, 50 క్వింటాళ్ళ పువ్వులతో అలంకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రావణ సంహారానంతరం రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి పండుగ జరుపుకోవడం ఉత్తర భారతదేశంలో ఒక ఆనవాయితీ. అందుకే ఈ యేడాది దీపావళి అయోధ్యలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ విశేష సందర్భం కోసం ప్రత్యేకమైన దీపాలు సిద్ధమవుతున్నాయి. ఆలయం ఆవరణ అంతా చాలాసేపు వెలుగులీనేలా దీపాలు అమర్చబోతున్నారు.
గుడిలోనూ, చుట్టుపక్కలా దీపాల అలంకరణను పర్యవేక్షించే బాధ్యతను ఒక విశ్రాంత ఐజీకి అప్పగించారు. ఆలయం ఆవరణను కొన్ని భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగంలోనూ దీపాలు వెలిగించడం, పరిశుభ్రత, అలంకరణ బాధ్యతలను ఒక్కో బృందం చేపడుతుంది.
రామమందిరం సుందరీకరణ బాధ్యతను బిహార్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐజీ అషూ శుక్లా స్వీకరించారు. అన్ని ద్వారాలనూ తోరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు.
ఆలయ ఆవరణలో నూనె మరకలు పడకుండా, పొగ చూరకుండా చూడడం కోసం మైనపు దీపాలు వాడాలని నిర్ణయించారు. ఎక్కువ సమయం, ఎక్కువ కాంతివంతంగా, తక్కువ కర్బన ఉద్గారాలతో వెలిగే దీపాలను మందిరం ఆవరణ అంతటా వెలిగిస్తారు. ఇవాళ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1 వరకూ మందిరంలో జరిగే అలంకరణలను భక్తులు దర్శించుకోవచ్చునని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
రామమందిరాన్ని అలంకరించడానికి 50 క్వింటాళ్ళ పువ్వులు వాడుతున్నారు. ఆలయం నాలుగు ప్రవేశద్వారాల దగ్గరా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుంది.
ఈ యేడాది అయోధ్యలోని సరయూ నదీ తీరం వెంబడి ఉన్న మొత్తం 55 ఘట్టాలనూ 20లక్షలకు పైగా దీపాలతో వెలిగించడానికి అన్ని యేర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తంగా ఈ దీపావళి పర్వదినాన అయోధ్య 25లక్షలకు పైగా దీపాల వెలుగులతో మెరిసిపోయే దీపోత్సవం జరుపుకుంటుంది.
ఘాట్ అలంకరణలు 95శాతం పూర్తయ్యాయి. ఈ యేడాది దీపోత్సవంలో పదివేల మందికి పైగా భక్తులు పాల్గొంటారు. ‘రామ్ కీ పైడీ’ దగ్గర వీక్షకుల కోసం గ్యాలరీ నిర్మాణం పూర్తయింది.