సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల అనేక దారుణాలు వెలుగు చూశాయి. సైబర్ నేరగాళ్లు స్వయంగా పేమెంట్ గేట్ వేలు సృష్టించి ఆర్‌టిఎక్స్ పే, పీస్ పే, పోకో, ఆర్పీ పే గేట్ వేల ద్వారా అక్రమ సంపాదన మొత్తాన్నిమనీలాంరింగునకు పాల్పడుతున్నట్లు తేలింది. నకిలీ గేట్ వేల ద్వారా జూదం, నకిలీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకోవడం,దోచుకున్న మొత్తాలను అద్దె బ్యాంకు ఖాతాల ద్వారా నగదుగా మార్చకుంటున్నారని గుర్తించారు. కొద్దిపాటి కమీషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.
అద్దెకు తీసుకున్న బ్యాంకు ఖాతాలు అంటే మూల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు వేల కోట్లు తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నకిలీ గేట్ వేల ద్వారా ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టి మనీలాండరింగునకు పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కమీషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఎవరికీ ఇవ్వొద్దని అధికారులు హెచ్చరించారు.
డిజిటల్ అరెస్టుల పేరుతో ఇటీవల కాలంలో వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు హోం శాఖ గుర్తించింది. ఇలాంటి అరెస్టులు లేవని స్పష్టం చేసింది. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నట్లు హోం శాఖ అధికారులు తెలిపారు. ఎవరికైనీ ఓటీపీలు చెప్పడం, బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇవ్వడం చేయవద్దన్నారు. డిజిటల్ అరెస్టులంతా భూటకమని భయపడి నగదు బదిలీ చేయవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సైబర్ నేరాల కట్టడికి 1900కు ఫోన్ చేయాలని కేంద్ర హోం శాఖ సూచించింది.