భారతదేశంలోని చాలావరకూ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు ధనత్రయోదశితో మొదలవుతాయి. ఈ యేడాది ధనత్రయోదశి పర్వదినం ఇవాళ అక్టోబర్ 29న వచ్చింది. దీన్నే ఉత్తరాదిలో ధన్‌తేరస్ అని కూడా పిలుస్తారు. చాలామంది ఈ పండుగ అంటే బంగారం కొనుక్కోవాలని భావిస్తారు. నిజానికి ఈ పండుగ ఆరోగ్యమే మహాభాగ్యమని చాటే పండుగ. ఆత్మిక వృద్ధినీ, కుటుంబ బంధాలనూ కాపాడుకోవాలని చెప్పే పండుగ.
ధనత్రయోదశి ప్రధానంగా ఇద్దరు దేవతలకు చెందిన పర్వదినం. ఒకరు మహాలక్ష్మి, మరొకరు ధన్వంతరి భగవానుడు. క్షీర సాగర మథన సమయంలో ఎన్నో విలువైన వస్తువులు, జీవాలూ ఉద్భవిస్తాయి. సకల సంపదలకూ అధిదేవత అయిన లక్ష్మీదేవి, ఆరోగ్య ప్రదాత ఆయుర్వేద దేవతామూర్తి అయిన ధన్వంతరి ఆ సాగర మథనంలోనే ఉద్భవించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి (ధన్‌తేరస్)గా జరుపుకోవడం హిందువుల సంప్రదాయం. సర్వసంపదల కోసం లక్ష్మీకటాక్షం, ఆరోగ్య సమృద్ధి కోసం ధన్వంతరీ కటాక్షం ఉండాలని కోరుకుంటూ వారిద్దరినీ ఈ పండుగ రోజున పూజిస్తాం.
యమధర్మరాజు గౌరవార్థం…:
ధనత్రయోదశి గురించి పెద్దగా తెలియని కథ ఒకటి ఉంది. హిముడు అనే రాజు కుమారుడికి మరణగండం ఉంటుంది. పెళ్ళయిన నాలుగవ రోజున అతను పాముకాటుతో చనిపోతాడని జ్యోతిషులు చెబుతారు. తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని భావించిన నవవధువు ఇల్లంతా దీపాలు వెలిగించి కాంతిమంతం చేస్తుంది. అలాగే తమ గదిలో ధగద్ధగాయమానంగా మెరిసిపోయే తన ఆభరణాలను ఉంచి ఆ గదిలోనూ చీకటి లేకుండా చేస్తుంది. కథలు చెబుతూ పాటలు పాడుతూ తన భర్తకు మరణం గురించిన ఆలోచన రాకుండా చేస్తుంది. మరోవైపు, ఆ యువకుడి ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడు ఆ దీపాలు, ఆభరణాల కాంతితో ఆ గదిలోకి వెళ్ళలేకపోతాడు. తెల్లవారే వరకూ ఎదురుచూసి, చివరికి ఆ యువకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అలా, దురదృష్టం నుంచి తప్పించుకున్న యువకుడు హాయిగా జీవిస్తాడు.
మరణం ముంగిట ఉన్న యువకుడికి ప్రాణభిక్ష పెట్టిన యమధర్మరాజు గౌరవార్ధం దీపాలు వెలిగించడం ఆనవాయితీగా మారింది. ఈ పండుగ రోజు పదమూడు మట్టిప్రమిదల్లో దీపాలు వెలిగించి ఇంటి ముంగిలిలో దక్షిణదిక్కుగా ఉంచుతారు. సాధారణంగా దీపాలను దక్షిణం వైపు ఉంచరు. కానీ మృత్యువుకు అధిదేవత అయిన యముడి గౌరవార్ధం ఈ ఒక్కరోజూ దక్షిణదిక్కులో దీపాలు ఉంచడం ఈ పండుగ ప్రత్యేకత. ఆ సందర్భంగా యముడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ శ్లోకం పఠిస్తారు…
త్యునా దండపాశాభ్యాం కాలేన శ్యామా సహ
త్రయోదశ్యాం దీపదానా సూయయజః ప్రీయతాం మమ
(ఈ పదమూడు దీపాలనూ సూర్యపుత్రుడైన యమధర్మరాజుకు అంకితం చేస్తున్నాను. ఈ మానవ జన్మ తాలూకు భవబంధాల నుంచి నన్ను విముక్తుడిని చేయమని ఆయనను ప్రార్థిస్తున్నాను)
లక్ష్మీపూజ, కుబేరపూజ:
ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని, కుబేరుణ్ణీ పూజించడం అనూచానంగా వస్తోంది. ఇళ్ళను పరిశుభ్రం చేసుకుని లక్ష్మీదేవి రాకకై సిద్ధం చేసి ఉంచుతారు. అందమైన ముగ్గులు వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యపు పిండితో లక్ష్మీదేవి పాదాలు ఇంట్లోకి వస్తున్నట్లు వేస్తారు. సాయంత్రం లక్ష్మీపూజ చేస్తారు. చమురు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలాగే ప్రపంచానికి కోశాధికారి అయిన కుబేరుణ్ణి కూడా పూజిస్తారు.
ధన్వంతరీ మంత్ర పారాయణం:
ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదన్నది మన పూర్వీకుల భావన. భౌతికమైన సిరిసంపదల కంటె ఆరోగ్యమే గొప్ప ఐశ్వర్యమని చెబుతుంటారు. అలాంటి చక్కటి ఆరోగ్యం కోసం ధన్వంతరి భగవానుణ్ణి ఇవాళ ప్రార్థిస్తారు.
‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిథయే శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరి స్వరూపాయ శ్రీశ్రీశ్రీ ఔషధ చక్రనారాయణ స్వాహా’’ అనే మంత్రాన్ని జపించి శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక సమృద్ధి కోసం ధన్వంతరి ఆశీస్సులు తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ధన త్రయోదశి కొనుగోళ్ళ సంప్రదాయం:
బంగారం, వెండి, ఇతర గృహసంబంధ వస్తువులు కొనడానికి ధనత్రయోదశి మంచిరోజు అని హిందువుల విశ్వాసం. విలువైన ఆ లోహాల ఆభరణాలను కొనుగోలు చేయడం రాబోయే యేడాది కాలమంతా జీవితంలోకి సిరిసంపదలను, అదృష్టాన్నీ ఆహ్వానించడంగా భావిస్తారు. చాలాచోట్ల ఈ ధనత్రయోదశి సందర్భంగా ఇంటికి, వంటింటికీ పనికివచ్చే వస్తువులు కూడా కొంటారు. ఆధునిక కాలంలో ఆభరణాలు, వస్తువులు, ఉపకరణాల కొనుగోళ్ళతో ధనత్రయోదశి ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే రోజుగానూ పేరుగడించింది. ఇవాళ ఆభరణాలో లేక వస్తువులో కొనడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్న నమ్మకమే దానికి కారణం.
ధన త్రయోదశి – జాతీయ ఆయుర్వేద దినం:
ధనత్రయోదశిని ఆరోగ్యపు పండుగగా కూడా జరుపుకుంటాం. ఆరోగ్యానికి అధిష్ఠాన దేవత, దేవవైద్యుడూ అయిన ధన్వంతరి జన్మదినం సందర్భంగా ఈ రోజును భారత ప్రభుత్వం జాతీయ ఆయుర్వేద దినంగా ప్రకటించి, పాటిస్తోంది. ఆయుర్వేదంలో ప్రధాన సూత్రాలు సమతౌల్యమైన, సంపూర్ణమైన ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని సాధించే పద్ధతులను అనుసరించాలని ఈ దినం గుర్తుచేస్తుంది. వనమూలికల వాడకం, యోగాభ్యాసం, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన విధానాలు దీర్ఘకాలికంగా ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఆధ్యాత్మిక సంపదల సాధన:
ధనత్రయోదశి అంటే కేవలం భౌతికమైన సంపదలను పోగువేసుకోవడం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంపదలను సాధించడం ఈ పండుగ ప్రబోధించే పెద్ద ప్రయోజనం. ఈ పర్వదినాన కుటుంబ సభ్యులందరూ కలిసి ధ్యానం చేయడం, యోగం అభ్యసించడం, ధార్మిక సాధనలు చేయడం, తద్వారా మానసిక శాంతిని సాధించడం ప్రధానం. ఇవాళ చేసే ఆధ్యాత్మిక సాధన వల్ల పరమపవిత్రమైన హృత్పద్మచక్రం వికసిస్తుందని యోగులు చెబుతారు. హృదయం లక్ష్మీదేవి స్థానం. అందుకే అంతర్గత సంపదల సాధనకోసం ఆమెను పూజించడం భారతీయ సంప్రదాయం. అలా, భౌతిక-ఆధ్యాత్మిక జీవితాలను సమతౌల్యం చేయడమే ధనత్రయోదశి పర్వదిన విశేషం.