కేరళలోని ఓ ఆలయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కేరళ కాసర్‌గోడ్‌లోని అంజోతరంబలం వీరర్కవు ఆలయంలో కాళియాట్లం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది ఈ ఉత్సవాలను తిలకించే సమయంలో పేల్చిన టపాసులు, నిల్వ ఉంచిన బాణాసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 150 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులను కన్నూర్, కాసరగోడ్, మంగళూరులోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాణాసంచా నిల్వకు అనుమతులు తీసుకోలేదని తెలిపారు. బాణాసంచా నిల్వ చేసిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో టపాసులు కాల్చరాదనే నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు గుర్తించారు. బాణాసంచా నిల్వదారులపై కేసులు నమోదు చేశారు.