కన్నూరు జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌బాబు అక్టోబర్ 15న తన అధికారిక నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం కేరళలో సంచలనం సృష్టించింది. ఆయన ఆత్మహత్యకు కారణం ఆ ప్రాంతంలోని సీపీఎం నాయకురాలు దివ్య చేసిన అవమానకర ప్రసంగమేనని తెలుస్తోంది.
నవీన్ బాబు ఇటీవల కన్నూరు జిల్లా నుంచి పత్తనంతిట్ట జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమంలో కన్నూరు జిల్లా కలెక్టర్ అరుణ్ కె విజయన్ కూడా పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే సీపీఎం నాయకురాలు దివ్య, నవీన్‌బాబును అవమానిస్తూ ప్రసంగం చేసింది. విచిత్రం ఏంటంటే ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోయినా దివ్య హాజరైంది.
నవీన్‌బాబు నిజాయితీపరుడైన, అవినీతికి లొంగని, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి అని తెలుస్తోంది. పెట్రోల్ బంకు లైసెన్స్ కోసం ఆయనకు టి.వి ప్రశాంతన్ అనే వ్యక్తి లంచం ఇచ్చాడని దొంగ ఆరోపణలు చేసారని సమాచారం. వాటికి తోడు ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పేలా దివ్య మాట్లాడిందని చార్జిషీటులో దాఖలైంది. ఈ నేపథ్యంలో అసలీ దివ్య ఎవరు, కలెక్టర్ స్థాయి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా అవమానించిన ఆమె కథ ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి.
సిపిం నాయకురాలైన దివ్య, కన్నూరు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. ఆ పదవిలోకి వచ్చిన గత మూడేళ్ళలో దివ్య ఏకంగా 26సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళివచ్చింది. అయితే ఆ పర్యటనల వెనుక మర్మం ఏమిటన్నది ఎవరికీ తెలియదు. దర్యాప్తు అధికారులు ఆ కోణంలో విచారించారో లేదో తెలియదు. దివ్య విదేశీ పర్యటనల ఖర్చులు ఎవరు భరించారో తెలీదు. అడిషనల్ కలెక్టర్ నవీన్‌బాబు మీద అవినీతి ఆరోపణలకు కారణమైన పెట్రోల్ బంక్ కోసం ప్రయత్నించిన వ్యక్తి దివ్య బినామీయే అని ఆరోపణలున్నాయి. విచిత్రం ఏంటంటే పంచాయతీ కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకి దివ్య కట్టబెట్టడానికి కారణమేంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దివ్య పరారీలో ఉంది. ఇప్పుడు ఆవిడ అవినీతి గురించి, వివాదాస్పద వ్యవహారాల గురించీ చాలా కథలు వినిపిస్తున్నాయి.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్నూరు జిల్లా పంచాయతీ అధ్యక్ష పదవి నుంచి దివ్యను తొలగించడం జరిగిపోయింది. అయినా ఆమె ఇంకా స్కూల్ కరిక్యులమ్ కమిటీ కోర్ గ్రూప్‌లో సభ్యురాలిగానే ఉంది. పంచాయతీ అధ్యక్షురాలుగా ఉన్నందునే ఆమెను ఆ కమిటీలోకి ఎంపిక చేసారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోయినా ఆ కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతోంది. దానిపై కుళత్తూర్ జైసింగ్ అనే సామాజిక కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసారు. ఈ వివరాలను బట్టి చూస్తే పెట్రోల్ బంక్ లైసెన్స్ అనేది ఆమె అవినీతి కథలో ఆవగింజంత మాత్రమే.
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్నూరు జిల్లా అధ్యక్షుడు షాజీ తెక్కెమురియిల్ దివ్య అవినీతిపై విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసారు. అదనపు కలెక్టర్ నవీన్‌బాబును ఆత్మహత్యకు ప్రేరేపించిన దివ్యను కాపాడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ వ్యాఖ్యానించారు. దివ్యను సవ్యంగా విచారిస్తే పెద్ద తలకాయల పేర్లు బైటపడతాయని భారతీయ మజ్దూర్ సంఘ్ ఆరోపించింది.