ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలు ఇవాళ వసు బారస్ పండుగతో మొదలవుతున్నాయి. గోవత్స ద్వాదశి అని కూడా పిలిచే ఈ పండుగ రోజును ఆవులు, ఆవుదూడలకు పూజలు చేస్తారు. ఈ పండుగ పూజలను ప్రదోష వేళ జరుపుకుంటారు. ఈ యేడాది భారతీయ కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.04 గంటల నుంచి 8.34 గంటల వరకూ గోవులకు పూజ చేయాలి.
వసు అంటే సంపద. బారస్ అంటే పన్నెండు, అంటే ద్వాదశి తిథికి సంకేతం. మానవులకు, ప్రకృతికీ మధ్య పరస్పర ఆధార బంధాన్నీ సూచించే రోజిది. ప్రత్యేకించి మనకూ, గోసంపదకూ ఉండే అనుబంధాన్ని వేడుక జరుపుకునే పండుగ ఇది. హిందువులు గోవును తల్లిగా భావిస్తారు. ఆవు సంపదకు, సమృద్ధికీ ప్రతీక. ఉత్తర భారతదేశంలో ఈ పండుగ రోజు ఆవులకు గౌరవ సూచకంగా పాలు, గోధుమ ఉత్పత్తులు వాడరు. ఆవులను అలంకరించి, వాటికి గడ్డి మేపి, వాటిని పూజిస్తారు.
ఈ పండుగ రోజు భక్తులు తెల్లవారుజామునే లేచి, తమ ఆవులను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. వాటికి గోధుమలు, బెల్లం కలిపి తినిపిస్తారు. సాధారణంగా ఈరోజు ఇళ్ళలోని ఆడవారు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం, సంపద, సమృద్ధి, కుటుంబ సంక్షేమం కోసం గోవులను జాగ్రత్తగా చూసుకుంటామని వారు సంకల్పం తీసుకుంటారు. గోవులను పూజించడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
మహారాష్ట్రలో దీపావళి వేడుకలు వసు బారస్‌తోనే మొదలవుతాయి. ఇవాళ ప్రతీ ఇంటిముంగిలినీ వర్ణమయమైన ముగ్గులతో తీర్చిదిద్దుతారు. తామరలు, కలువలు, నెమళ్ళు, ఆవులు, చిన్నికృష్ణుడి పాదాలు… ఇలాంటి ముగ్గులు వేస్తారు. ప్రకృతి సహజ రంగులు, బియ్యంపిండి, పువ్వులతో ముగ్గులు మెరిసిపోతుంటాయి. దీపావళి పండుగ సందర్భంగా ఇళ్ళకు బంధువులు, అతిథులు రావడం నేటినుంచే మొదలవుతుంది. అలా ఈ పండుగ సమైక్యతను, ప్రకృతి పట్ల గౌరవాన్నీ, జీవిత విలువలనూ ప్రబోధిస్తుంది.
ఉత్తరభారతదేశంలో ఈ పండుగను, ప్రకృతిని గౌరవించి రక్షించుకోడానికి మనం నిబద్ధతను చాటుకునే రోజుగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మనకు జీవితాన్నీ ఆహారాన్నీ ఇచ్చే ఆవులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేసే సందర్భమిది. నిరాడంబరత, కృతజ్ఞత, ప్రకృతితో తాదాత్మ్యత అనే గుణాలను గుర్తుచేసే పర్వదినమిది.