అంతర్జాతీయంగా లభించిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఒక దశలో 1100 పాయింట్లు పెరిగి 80539 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ చివరకు 602 పాయింట్లు పెరిగి 80005 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా పరుగులు పెట్టింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 24339 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50 ఇండెక్సులో అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, విప్రో లాభపడ్డాయి. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సెస్ బ్యాంకు, హీరో మోటార్స్ నష్టపోయాయి. బ్యాంకింగ్ సూచీ 3.8 శాతం లోహ సూచీ 2.5 శాతం పెరిగాయి.
చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 72 అమెరికా డాలర్లకు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లకు ఊతం లభించింది. రూపాయి స్వల్పంగా బలపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 84 వద్ద ట్రేడవుతోంది. 31 గ్రాముల ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2735 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని చమురు నిల్వలు, అణుస్థావరాలపై దాడులు చేయకపోవడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నెలకొంది. ఆసియా మార్కెట్లో భారీ లాభాలతో ప్రారంభం కావడం కూడా కలసి వచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒకే రోజు రూ.6 లక్షల కోట్లు లాభపడ్డాయి.