వినాయక చవితి నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ ఇంట్లో పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాయి. ఆ అంశంపై చంద్రచూడ్ ఇప్పుడు స్పందించారు. ఆ సమావేశంలో జ్యుడీషియల్ విషయాలేవీ చర్చించలేదని చెప్పారు. లోక్‌సత్తా యాన్యువల్ లెక్చర్‌లో పాల్గొన్నప్పుడు ఎదురైన ప్రశ్నకు చంద్రచూడ్ జవాబిచ్చారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రులు క్రమం తప్పకుండా కలుసుకుంటూ ఉంటారని గుర్తుచేసారు.
‘‘ఈ సమావేశాలు దేనికని ప్రజలు అనుకోవచ్చు. మన రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వమైనది. రాజకీయవర్గాలు జ్యుడీషియరీ విషయంలో వినయంగా ఉంటారు. అది అందరికీ తెలిసిందే. జ్యుడీషియరీకి బడ్జెట్ ప్రభుత్వం నుంచే రావాలి. అది జడ్జిల కోసం కాదు. మాకు కొత్త కోర్టు భవనాలు కావాలి. జిల్లాల్లో జడ్జిలకి కొత్త ఇళ్ళు కావాలి. దానికోసం ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రులతో సమావేశం అవడం తప్పనిసరి’’ అని వివరించారు.
తను గతంలో అలహాబాద్ హైకోర్టులో సీజేగా పనిచేసానని చంద్రచూడ్ చెప్పారు. ‘‘ప్రధాన న్యాయమూర్తిని నియమించాక, ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలుస్తాడు. తర్వాత ముఖ్యమంత్రి సీజేని ఆయన నివాసంలో కలుస్తాడు. ఆ సమావేశాలు అజెండాను నిర్దేశిస్తాయి. ఉదాహరణకి రాష్ట్రంలో పది ప్రాజెక్టులు నడుస్తున్నాయనుకోండి, వాటి గురించి వివరిస్తారు. తమ ప్రాధామ్యాలేమిటో సీఎం చెబుతారు’’ అని చంద్రచూడ్ వివరించారు.
‘‘రాజకీయ నాయకులు చాలా పరిపక్వతతో ఉంటారు. ఇలాంటి సమావేశాల్లో ఏ సీఎం ఐనా ఎప్పుడూ ఎలాంటి పెండింగ్ కేసుల గురించీ అడగరు. ఆగస్టు 14, జనవరి 26, ఏదైనా పెళ్ళి లేదా చావు అలాంటి సందర్భాల్లో సీఎం, సీజే కలుస్తారు. అప్పుడు న్యాయవ్యవస్థ గురించి చర్చ ఉండదు. జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. నిజానికి మామూలు పిచ్చాపాటీ కబుర్లే ఉంటాయి’’ అని స్పష్టం చేసారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో గణపతి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడంపై అలాంటి సమావేశాలు అనుమానాలు కలగజేస్తాయంటూ ప్రతిపక్షాలు ఘాటైన విమర్శలు చేసాయి. అయితే బీజేపీ ఆ విమర్శలను తిప్పికొట్టింది. ‘‘ప్రధానమంత్రులు ఇఫ్తార్ పార్టీలకు హాజరైనప్పుడు వీళ్ళే చప్పట్లు కొడతారు. ఇప్పుడు మాత్రం ప్రధాని మోదీ సీజే చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొంటే వీళ్ళ నోళ్ళు ఊరుకోవడం లేదు. కోట్లాది భక్తులు ప్రార్థించే దేవతలను కార్యనిర్వాహక, న్యాయ విభాగాల అధిపతులు కలిసి పూజించడం భారతదేశపు లౌకికవాదం యొక్క నిజమైన శక్తిని సూచిస్తుంది. దాన్ని ఒప్పుకోండి’’ అంటూ కేంద్రమంత్రి భూపీందర్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
2009లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు నాటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారు. ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి డివై చంద్రచూడ్ నవంబర్ 10న రిటైర్ అవుతున్నారు. ఆయన తర్వాత ఆ పదవిని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వీకరిస్తారు.