జనగణనకు కేంద్రం సిద్దమవుతోంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏదొక కారణంతో ఈ మహాక్రతవు వాయిదా పడుతూనే వస్తోంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో అనేక పథకాల అమలుకు 2011 గణాంకాలను ఉపయోగించుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇటీవల భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిందంటూ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 144 కోట్ల జనాభా ఉందని అంచనా . వచ్చే ఏడాది జనగణన పూర్తి చేసి ఆ తరవాత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం యోచిస్తోంది. తాజాగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుంది.
జనాభా లెక్కల్లో కులగణన చేర్చుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. జనగణనలో ఏఏ ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి సమాచారం సేకరించబోతున్నారనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. దాదాపు 40 ప్రశ్నలకు సమాధానాలు సేకరించడం ద్వారా పేదరికంతోపాటు, అనేక విషయాలను అంచనా వేయనున్నారు. 2011 నుంచి 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై అనేక విమర్శలు వచ్చాయి. జనాభా లెక్కలు తేల్చకుండా విడుదల చేసిన ప్రకటనలపై విమక్షాలు మండిపడుతున్నాయి.
జనగణనతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలపై క్లారిటీ రానుంది. దక్షిణాదిలో జనాభావృద్ది 1.6 శాతంగా ఉందని అంచనా. ఉత్తరాది రాష్ట్రాల్లో అది 2.4 నుంచి 3 శాతం దాకా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే అవకాశాలున్నాయి. అయితే పార్లమెంటు సీట్లు కూడా పెంచే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.