విమానయానరంగంలో భారత్ కీలక ముందడుగు వేసింది. స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థతో కలసి టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ లిమిటెడ్ గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంచెజ్ ఇవాళ ప్రారంభించారు. విమానయానరంగంలో ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయడ్డారు. అంతకు ముందు ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంచెజ్ రోడ్ షోలో పాల్గొన్నారు.
భారత్‌కు 56 సి-295 విమానాలు అందించేందుకు స్పెయిన్ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ తయారు చేయనుంది. మిగిలిన విమానాలు వడోదరలోని కర్మాగారంలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి విమానాల తయారీ ప్రారంభం అవుతుంది. భారత రక్షణ రంగంలో పాతపడిపోయిన ఆవ్రో 748 స్థానంలో సి-295 ప్రవేశపెడతారు.
సి-295 విమానాలు రక్షణరంగంలో కీలకంగా సేవలందించనున్నాయి. పది టన్నుల వరకు బరువును తీసుకెళ్లగలవు. 50 నుంచి 70 మంది సైనికులను యుద్ధ క్షేత్రాలకు తీసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం. చాలా తక్కువ పొడవు ఉండే రన్ వేలపై కూడా సురక్షితంగా దిగగలవు. రూ.21 వేల కోట్ల విలువైన ఈ కాంట్రాక్టుపై 2022లో ఎంవోయూ జరిగింది. ఎయిర్‌బస్ స్పెయిన్ తరవాత మరో దేశంలో విమానాలు తయారు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
దేశీయంగా విమానాలు ఉత్పత్తి చేసేందుకు టాటా సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా విశేషంగా కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. టాటా సంస్థకు చెందిన 200 మంది ఇంజనీర్లకు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ కర్మాగారంలో శిక్షణ అందిస్తున్నారు. ఈ కర్మాగారం పూర్తిగా అందుబాటులోకి వస్తే 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 40 సంస్థలు ఈ విమానాల తయారీలో కీలకంగా పనిచేయనున్నాయని టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.