దేశం కాని దేశం నుంచి వచ్చింది. ఇక్కడి విజ్ఞానంతో విస్మితురాలైంది. భారతీయ విద్యపై మమకారం పెంచుకుంది. ఈ దేశానికి నివేదనగా మారి సేవ చేసుకుంది. ఆమే సోదరి నివేదిత. నేడు ఆమె 157వ జయంతి.
మిస్ మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఐరిష్ వనిత. 1898 జనవరి 28న ఆమె భారతదేశం వచ్చినపుడు ఆమెకు స్వామి వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేసారు. అది కేవలం భారతీయమైన పేరు మాత్రమే కాదు. భారతదేశపు సేవ కోసం తన జీవితాన్నే అంకితం చేసుకున్న మహిళకు సరైన పేరు.
భారతదేశ పునర్నిర్మాణం కోసం, భారతీయ మహిళల ఉద్ధరణ కోసం స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపుతో నివేదిత స్ఫూర్తి పొందింది. భారతదేశాన్ని తన కర్మభూమిగా భావించింది, తన కొత్త ఉనికితో భారతమాత సేవలో జీవితాంతం పయనించాలని నిర్ణయించుకుంది. భారతదేశమంటే నివేదితకు ఎంత ప్రేమంటే గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ ఆమె గురించి ఇలా అన్నారు. ‘‘భారతదేశాన్ని నివేదిత ప్రేమించినంత గొప్పగా ఏ భారతీయుడైనా ప్రేమించాడా అని నాకు అనుమానమే.’’
నివేదిత భారతదేశానికి చేసిన గొప్ప సేవ ఇక్కడి విద్యావిధానానికి చేసిన సేవ. కేవలం ఎకడమిక్ చదువులు చెప్పడం చాలదు, ప్రజలు తమ దేశం గురించి గర్వపడాలి, తమ దేశపు బాధ్యత స్వీకరించాలి. భారతదేశంలో అలాంటి విద్యావ్యవస్థ ఉండాలి… అదీ నివేదిత దార్శనికత. ఈ దేశంలో నిజమైన చదువు భారతీయ విలువలు, సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉండాలి తప్ప యూరోపియన్ ఆదర్శాలను అచ్చుగుద్ది దింపేయకూడదు అని నివేదిత వాదించేది. భారతీయులు ఐరోపాకు బలహీనమైన నకళ్ళలా ఉండకూడదు, వారు భారతమాత పుత్రులు, పుత్రికల్లా ఉండాలని నివేదిత చెబుతూ ఉండేది.
నివేదిత 1898లో ఉత్తర కోల్‌కతాలోని సంప్రదాయిక వాతావరణంలో తన ప్రయోగాత్మక పాఠశాలను ప్రారంభించింది. ఆమె ఇంటింటికీ వెళ్ళి విద్యార్ధులను చదువుకోడానికి పంపించమని అడిగేది. ఆ పాఠశాలలో జాతీయతావాద భావజాలం కలిగిన విద్యను బోధించేవారు. దేశమంతా వందేమాతరం గీతాలాపనను నిషేధించినప్పుడు సైతం ఆమె పాఠశాలలో అదే ప్రారంభగీతంగా పాడేవారు. ప్రాచీన భారత వైదిక సమాజంలోని జ్ఞాన శక్తివంతులైన ఋషికలు మైత్రేయి, గార్గి వంటి మహిళలను తయారు చేసేలా పాఠశాలలు ఉండాలని ఆమె సంకల్పించారు. భారత జాతీయ విద్యకు తమ పాఠశాల కేంద్రంగా ఉండాలని ఆమె భావించారు. భారతదేశ సంక్షేమం కోసం పాటుపడే జ్ఞానవంతులైన పౌరులను తరతరాలు తయారుచేసే కేంద్రంగా తమ పాఠశాల ఉండాలని కోరుకున్నారు.
నివేదిత ప్రధానంగా మహిళా సాధికారతపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా భారతీయ మహిళలను ప్రాచీన కాలంలోలా హుందాగా, మృదువుగా, మధురంగా, ధర్మనిష్ఠతో ఉండేలా చేయాలని… అదే సమయంలో వారికి ఆధునిక ప్రపంచంలో జీవించడానికి తగిన విద్య, నైపుణ్యాల్లో శిక్షణ ఉండాలని భావించారు. అలాంటి సమతౌల్యమే భారత మహిళను నిజంగా ఉద్ధరించగలదని ఆమె స్పష్టం చేసారు.
నివేదిత పాఠశాల కేవలం సాధారణ విద్యను అందించే పాఠశాల కాదు. ఆ బడిలో హస్తకళలు, వొకేషనల్ ట్రయినింగ్ ఉండేవి. ప్రత్యేకించి విధవలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే అంశాలు బోధించేవారు. విద్యకు, పరిశ్రమకు సంబంధం ఉండాలన్నది నివేదిత లక్ష్యం. విద్యావంతులైన మహిళల నైపుణ్యంతో కూడిన చేతుల మీదుగా సంప్రదాయ భారత పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఆమె పాటుపడ్డారు.
సోదరి నివేదిత విద్యావేత్త మాత్రమే కాదు, ఆమె ప్రఖర జాతీయవాది కూడా. దేశంలో ఎంతోమంది గుండెల్లో దేశభక్తి అనే జ్వాలను రగిలించడంలో నివేదిత కీలకపాత్ర పోషించారు. జాతీయవాద కార్యకలాపాలకు ఆమె పాఠశాల కేంద్రస్థానంగా ఉండేది. స్వాతంత్ర్య సమరయోధులను విడుదల చేసినప్పుడల్లా ఆ పాఠశాలలో వేడుకలు చేసుకునే వారు. స్వాతంత్ర్యోద్యమ నేతల ప్రసంగాలను వినడానికి ఆ పాఠశాల విద్యార్ధులను తీసుకువెడుతుండేవారు.
1904లో మొదటిసారిగా భారతదేశపు జాతీయ పతాక నమూనాను నివేదిత రూపొందించింది. దధీచి మహర్షి శక్తికీచ త్యాగానికీ చిహ్నమైన వజ్రం ఆ జెండా మధ్యలో ఉండేది. వలస పాలన పట్ల భారతీయ ప్రజల్లో పెరుగుతున్న నిరసనకు ప్రతీకగా రూపొందిన ఆ పతాకాన్ని 1906 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రదర్శించారు.
నివేదిత 1905 నాటి స్వదేశీ ఉద్యమాన్ని పూర్తిగా అనుసరించారు. విదేశీ వస్తువులను బహిష్కరించడంగా మాత్రమే ఆ ఉద్యమాన్ని ఆమె చూడలేదు. ఆమె ఆ ఉద్యమాన్ని జాతీయతాభావం కోసం చేసే ఆధ్యాత్మిక తపస్సుగా పరిగణించింది.
నివేదిత తత్వంలో ప్రధానాంశం అఖండ భారతదేశమే. ‘భారతదేశం ఒకటి. అది ఎప్పుడూ అఖండంగానే ఉండాలి’ అని అనునిత్యం స్మరించాలంటూ నివేదిత భారతీయులకు పదేపదే విజ్ఞప్తి చేసేది. దేశ సమైక్యత పట్ల విశ్వాసం కలిగి ఉండడం ఆమె సందేశపు ప్రధానాంశం. మాతృభూమిని ప్రేమించడం, సేవించడం భారతీయులందరి పవిత్ర కర్తవ్యం అని నివేదిత హితవు పలుకుతూ ఉండేది.
నివేదిత గొప్ప రచయిత. ఆనాటి కాలంలో ఉన్న ప్రధానమైన దినపత్రికలు, ఇతు పత్రికలకు నిరంతరాయంగా వ్యాసాలు రాస్తూ ఉండేది. జాతీయతావాదం, దేశీయ విద్య, కళలు, సంస్కృతి పునరుద్ధరణ వంటి అంశాలపై సాధికారంగా నివేదిత రాసే వ్యాసాలు, రచనలు పాఠకుల్లో దేశభక్తి భావోద్వేగాన్ని పాదుగొల్పేవి.
విద్య, జాతీయభావంతో పాటు నివేదిత ప్రధానంగా ప్రస్తావించిన అంశం భారతదేశంలో విజ్ఞానశాస్త్ర పురోగతి. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక, జీవ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కోల్‌కతాలో దేశంలోనే గొప్పదైన వైజ్ఞానిక పరిశోధనా సంస్థ బోస్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించేలా చేయడంలో నివేదిత కీలక పాత్ర పోషించింది.
నిరుపేద ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసిన మహనీయురాలు నివేదిత. కోల్‌కతాలో ప్లేగు మహమ్మారి ప్రబలినప్పుడు, బెంగాల్‌ను వరదలు ముంచెత్తినప్పుడు బాధితులకు సహాయ కార్యక్రమాల్లో నివేదిత ముందు నిలిచింది. బాగ్‌బజార్‌లోని ఆమె చిన్న ఇంట్లో ఆ కాలంలోని ఎంతోమంది గొప్పవారు విద్య, రాజకీయాలు, సంఘ సంస్కరణ గురించి చర్చోపచర్చలు జరిపేవారు.
భారతదేశానికి సోదరి నివేదిత చేసిన సేవలను కొలవడం సాధ్యం కాదు. విద్యారంగంలో ఆమె చేసిన కృషి, మహిళా సాధికారతకు ఆమె పడిన ప్రయాస, జాతీయోద్యమంలో పాల్గొన్న ఆమె దేశభక్తి నివేదితను భారత చరిత్రలో చిరస్మరణీయురాలిగా నిలిపాయి.