జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం ఉదయం 7గంటలకు గస్తీలో ఉన్న సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన అఖ్నూర్ సెక్టార్లో చోటు చేసుకుంది. ఈ దాడిలో సైనికులు తృటిలో తప్పించుకున్నారు. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
జమ్ము కాశ్మీర్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. నాలుగు రోజుల కిందట ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గత వారం
సోన్మార్గ్ సమీపంలోనూ ఉగ్రవాదులు తెగబడ్డారు. జాతీయ రహదారి పనులు ముగించుకుని క్యాంపుకు చేరుకున్న కార్మికులపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే.
జమ్ము కశ్మీర్లో ఇటీవల కాలంలో ప్రతి వారం ఏదొక మూల ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. స్థానిక పోలీసులు, సైన్యం నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నా ఉగ్ర మూకలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గడచిన ఆరుమాసాల్లో జేకేలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 87 మంది ప్రాణాలు కోల్పోయారు.