భాగ్యనగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేసే పరిణామం చోటు చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి ప్రాంతంలో 750 ఎకరాలు తమవేనంటూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్ తాజాగా ప్రకటించింది. దాంతో వందకు పైగా సర్వే నెంబర్లలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ళ వ్యవహారాలను రిజిస్ట్రేషన్ శాఖ నిలిపివేయడం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. ఆ ఆస్తులను వక్ఫ్ బోర్డ్ తమవిగా ప్రకటించేసుకుని ఒక పద్ధతి ప్రకారం ఆక్రమించేసుకునే ప్రయత్నం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
మల్కాజిగిరి సబ్‌రిజిస్ట్రార్ శ్రీకాంత్ ఆ ఆస్తులు వక్ఫ్ ఆస్తి అని వెల్లడించడంతో ప్రజలకు కళ్ళు బైర్లుకమ్మాయి. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ ఎలాంటి పారదర్శకతా లేకుండా ఎలాంటి సంప్రదింపులూ జరపకుండా ఏకపక్షంగా అవి వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తులు అని ప్రకటించేసింది. ‘‘మేమెంతో కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బులతో కొనుక్కున్న స్థలాలను కనీసం ఎలాంటి ఆధారమూ లేక సమర్థనా లేకుండా లాగేసుకోడానికి వక్ఫ్ బోర్డు ప్రయత్నిస్తోంది’’ అంటూ స్థానిక నివాసి రమేష్ ఆవేదన వ్యక్తం చేసారు.
మల్కాజిగిరి ప్రాంతంలో నిర్దేశించిన కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం కమిషనర్ అండ్ ఐజీ ఆగస్టు 27న మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆదేశించారు. దాంతో స్థానిక ప్రజల ఆందోళనకు అంతే లేకుండా పోయింది. అసలు ఆ భూములు తమవేనని చెప్పుకోడానికి వక్ఫ్ బోర్డ్కున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ‘‘మేము ఈ స్థలాలు కొనుక్కుని కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి, ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి మా ఇళ్ళని వక్ఫ్ భూమి అని చెబుతున్నారు. ఇంతకుమించిన దారుణం ఇంకేమైనా ఉందా? మా జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఈ ఇళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు వాటిని కనీసం వివరణ అయినా లేకుండా లాక్కుపోడానికి ప్రయత్నిస్తున్నారు’’ అంటూ ఈస్ట్ కాకతీయ నగర్ నివాసి ఫణి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు.
మేడ్చల్ మల్కాజిగిర జిల్లా కలెక్టర్ లేఖను ఆధారంగా చూపిస్తూ వక్ఫ్ బోర్డ్ నిషిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చడానికి పలు సర్వే నెంబర్లను గుర్తించింది. దాని పరిణామాల తీవ్రతను తలచుకుని ప్రజలు భయపడుతున్నారు. తమ ఆస్తులు పోవడం మాత్రమే కాదు, వాటి గురించి అడగడానికి తమకు హక్కు అయినా లేకుండా పోయిందన్న ఆవేదన వారిని తొలిచేస్తోంది. ‘‘వక్ఫ్ భూముల పేరుతో మా కాళ్ళ కింది నేలను లాగేసుకుని మమ్మల్ని నిలువునా ముంచేసే దుర్మార్గమైన ప్రయత్నం ఇది. ఈ చర్య మామీద ఏకపక్షంగా జరుగుతున్న దాడి’’ అని మల్కాజిగిరి నివాసి రాఘవేంద్ర వాపోయారు.
వక్ఫ్ బోర్డ్ తమ పచ్చజెండా కప్పేసిన 750 ఎకరాల భూముల్లో మౌలాలీ, ఆర్టిసి కాలనీ, షఫీనగర్, తిరుమల నగర్, భరత్ నగర్, ఎన్బిహెచ్ కాలనీ, ఈస్ట్ కాకతీయ నగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, న్యూ విద్యా నగర్, రామబ్రహ్మ నగర్, శ్రీకృష్ణా నగర్, సీతారాంనగర్ తదితర ప్రదేశాలు ఉన్నాయి.
వక్ఫ్ బోర్డ్ చేస్తున్న ఈ అన్యాయపు భూకబ్జాకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా గళమెత్తుతున్నారు. ‘‘మేం ఇలా జరగనివ్వం. మేం పోరాడతాం. మా వాదన విని తీరాల్సిందే’’ అని స్థానిక మునిసిపల్ కార్పొరేటర్ శ్యానం రాజ్యలక్ష్మి చెప్పారు.
వక్ఫ్ బోర్డ్ ఆక్రమణల వల్ల బాధపడుతున్నది కొందరు వ్యక్తులు మాత్రమే కాదు, మొత్తంగా కొన్ని ప్రాంతాలే ఆవేదన చెందుతున్నాయి. మౌలాలీ, ఆర్టిసి కాలనీ, ఓల్డ్ సఫిల్‌గూడ ప్రాంతాల్లో ప్రజలందరూ ఏకమై వక్ఫ్ బోర్డు ప్రకటనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణల గురించి దక్షిణ భారతదేశం, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియదు. ఇప్పుడు మల్కాజిగిరి ఉదంతం తర్వాతయినా ప్రజల్లో అవగాహన కలగాలని కోరుకుందాం.