కర్ణాటకలోని కార్వార్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సెయిల్‌కు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. బెలెకెరి రేవు నుంచి ముడి ఇనుము అక్రమ రవాణా చేస్తున్నాడన్న ఆరోపణలు నిరూపణ అవడంతో కోర్టు ఎమ్మెల్యేకు ఈ శిక్ష విధించింది. ఎమ్మెల్యే మీద అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులున్నాయి. వాటిలో ఒక కేసులో ఈ శిక్ష పడింది. మిగతా కేసులకు సంబంధించి వేర్వేరు శిక్షలు, జరిమానాలు విధించింది. అవన్నీ కలుపుకుంటే కుట్రకు ఐదేళ్ళు, మోసానికి ఏడేళ్ళు, దొంగతనానికి మూడేళ్ళు శిక్షలు పడ్డాయి.
సతీష్ మీదున్న కేసుల విచారణ అక్టోబర్ 24న పూర్తయింది. ఆ విచారణలో ఆయన దోషి అని తేలింది. వాటికి సంబంధించి శిక్షలను న్యాయస్థానం శనివారం నాడు ఖరారు చేసింది. మొత్తం ఆరు కేసులకూ కలిపి పైన చెప్పిన జైలుశిక్షలకు అదనంగా రూ.44కోట్లకు పైగా జరిమానా విధించింది. ఆ కేసుల్లో సతీష్‌తో సహనిందితులైన మహేషి బిలియే, ఖారపూడి మహేష్, మల్లికార్జున షిప్పింగ్ సంస్థ ప్రతినిధులకు కూడా శిక్షలు పడ్డాయి.
ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధి అయిన వ్యక్తికి రెండేళ్ళకు పైగా జైలుశిక్ష పడితే అతను ఆ పదవికి అనర్హుడవుతాడు. ఎమ్మెల్యే సీటు కోల్పోతాడు. అయితే సతీష్ ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే, శిక్షల అమలు మీద స్టే తెచ్చుకుంటే, ఎమ్మెల్యే పదవికి అనర్హతను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.
ఈ కేసు మూలాలు బళ్ళారి, హోస్పేట, సండూరు, చిత్రదుర్గ అటవీ ప్రాంతాల్లో గనుల అక్రమ తవ్వకాలు, ముడి ఇనుము అక్రమ రవాణాలో ఉన్నాయి. సరైన అనుమతులు లేకుండా భారీ మొత్తాల్లో ముడి ఇనుమును అక్రమ రవాణా చేయడం ఆ ప్రాంతాల్లో సర్వసాధారణం. 2010 మార్చి 20న అటవీశాఖ రూ.350 కోట్ల విలువైన 8.5లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని స్వాధీనం చేసుకుంది. దాన్ని భద్రపరిచే బాధ్యతను రేవుల విభాగానికి అప్పగించారు. కొన్ని నెలల తర్వాత అటవీశాఖ రీ-ఇనస్పెక్షన్ చేసినప్పుడు కేవలం 2లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం మాత్రమే మిగిలుంది. దాన్నిబట్టి పోర్ట్ అధికారులకు, షిప్పింగ్ కంపెనీలకూ ఉన్న సంబంధాలు అర్ధం చేసుకోవచ్చు.
కర్ణాటక లోకాయుక్త దానిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించింది. 2010 జూన్ 23న ఆ కేసును సిఐడికి అప్పగించారు. 2011లో సుప్రీంకోర్టు ఆ కేసును సిబిఐకి బదిలీ చేసి, 2009 నుంచి 2010 మే వరకూ జరిగిన అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా గురించి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సిబిఐ 2013 సెప్టెంబర్ 13న అధికారికంగా కేసు నమోదు చేసింది.
సిబిఐ దర్యాప్తులో గనుల అక్రమ తవ్వకాలు, అక్రమ ఎగుమతుల వ్యవహారాల నెట్‌వర్క్ బైటపడింది. అందులో చాలా కంపెనీలున్నాయి. వాటిలో ఎమ్మెల్యే సతీష్‌కు చెందిన శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. బెలెకెరె ఓడరేవు ద్వారా 88.06 మెట్రిక్ టన్నుల ముడి ఇనుమును 73 వేర్వేరు కంపెనీలు విదేశాలకు అక్రమంగా తరలించాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. అందులో శ్రీమల్లికార్జున షిప్పింగ్ ఒక్క సంస్థే 7.23 లక్షల మెట్రిక్ టన్నుల ముడిఇనుమును అక్రమ రవాణా చేసిందని నిర్ధారణ అయింది.
అలా, పదేళ్ళ కంటె ఎక్కువ కాలం నుంచి జరుగుతున్న అక్రమ తవ్వకాలు, రవాణా దందా గురించి వేసిన కేసులో ఎమ్మెల్యే సతీష్ దోషి అని ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది.