విదేశీ ఈక్విటీ పెట్టుబడులు గడచిన 25 రోజుల్లో భారీగా తరలిపోయాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చైనాలో ఉద్దీపన ప్యాకేజీలు అమలు చేయడం కూడా విదేశీ ఈక్విటీ పెట్టుబడులు తరలిపోవడానికి దారితీశాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అక్టోబరు 1 నుంచి 25 వరకు రూ.85790 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం.గడచిన పది మాసాల్లో అత్యధికంగా అక్టోబరులో పెట్టుబడులు తరలిపోయాయని వెల్లడైంది.
జనవరిలో రూ.25744 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. ఫిబ్రవరిలో రూ.1539 కోట్లు, మార్చిలో రూ.35098 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఏప్రిల్లో రూ.8671 కోట్లు, మేలో రూ.25586 కోట్లు తరలిపోయాయి. ఎన్నికల ఫలితాల తరవాత జూన్లో రూ.25,565 కోట్లు, జులైలో రూ.32,359 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.ఆగష్టులో రూ.7322 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికంగా ఉద్రిక్తతలు పెరిగిపోవడం కూడా స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తరలిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియాలో ముదిరిన సంక్షోభం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఏ మాత్రం క్షేమం కాదని భావించిన ఇన్వెస్టర్లు, మెటల్ మార్కెట్లకు తరలుతున్నారు. మరోవైపు ముడిచమురు ధరలు బ్యారెల్కు 76 అమెరికా డాలర్లను దాటిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు