విశాఖపట్నం- విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్టణం విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:55కు గన్నవరం( విజయవాడ)లో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది.
ఇండిగో సర్వీసు విజయవాడలో రాత్రి 7:15కు బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ తిరిగి చేరుకుంటుంది. ఈ కొత్త సర్వీసులతో కలిపి విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరింది.
విశాఖ-విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది ప్రయాణికులు కోరారని తెలిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం ఇదే మొదటిసారి అన్నారు. ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉందన్నారు.