దీపావళి పండుగ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. తెల్లవారుజామున పెద్దఎత్తున ప్రయాణీకులు పోటెత్తడంతో ఉదయం 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1 పై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం మీదికి రాగానే ప్రయాణీకులు సీట్ల కోసం పోటీపడ్డారు.అందరూ ముందుగా రైలు ఎక్కేందుకు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బాంద్రా ఆసుపత్రికి తరలించారు.
పండుగ రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) పేర్కొంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, రక్తంతో ఫ్లాట్ ఫాం ఎర్రగా మారిపోయింది. కొందరు ప్రయాణికులు స్పృహ తప్పి ప్లాట్‌ఫాంపై పడిపోయారు.
వెంటనే రైల్వే పోలీసులు స్పందించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. సకాలంలో బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.