అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అయ్యప్ప దర్శనానికి విమానాల్లో వెళ్లే ప్రయాణీకులు ఇప్పటి వరకు ఇరుముడిని, తలపై తీసుకెళ్లే అవకాశం లేదు. బ్యాగేజీలో ఇరుముడులు తీసుకెళ్లాల్సి వస్తోంది. భక్తుల సౌలభ్యం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడిని భక్తులు వారితోనే తీసుకెళ్లవచ్చని పౌరవిమానయానశాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఇరుముడిని విమానాల్లో అనుమతిస్తోన్నట్లు స్పష్టం చేశారు.
ఏటా 3 కోట్ల మంది భక్తులు కేరళలోని అయ్యప్పస్వామి దర్శనం చేసుకుంటున్నారు. వీరిలో దాదాపు 10 లక్షల మంది విమాన ప్రయాణం ద్వారా స్వామి దర్శనం చేసుకుంటున్నారని అంచనా. వీరంతా ఇరుముడిని బ్యాగేజీలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. తాజా నిర్ణయంతో ఇరుముడిని తలపైనే ఉంచుకుని ప్రయాణం చేసే సదుపాయం కల్పించారు. కేంద్ర నిర్ణయంపై అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పౌరవిమానయానశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రతి రోజూ రెండు విమాన సర్వీసులు పెంచినట్లు మంత్రి రాంమ్మోహన్‌నాయుడు ప్రకటించారు. అనుకున్న సమయం కన్నా ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. రణస్థలం జాతీయ రహదారిని ఆరువరుసల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు రూ.6 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
రాబోయే పదేళ్లలో దేశంలో 200 కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రాబోతున్నాయని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విమాన ప్రయాణీకుల సంఖ్య 2034 నాటికి 5 రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. విజయవాడ విమానాశ్రయంలోని టెర్నినల్ పనులు వేగంగా జరుగుతోన్నట్లు తెలిపారు.