ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనను మోసం చేశాడంటూ ఆయన చెల్లి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. గత కొంత కాలంగా వారిద్దరి మధ్య కొనసాగుతోన్న ఆస్తుల పంపిణీ వ్యవహారం రచ్చకెక్కింది. ఆక్రమాస్తుల కేసుల్లో నుంచి బయటపడేందుకే తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, అలా చేయకుంటే కేసుల నుంచి బయటపడటం సాధ్యం కాదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సలహా మేరకు నడచుకోలేదా అంటూ షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టి రుణం తీర్చుకుంది మీరు కాదా? అంటూ షర్మిల ప్రశ్నించారు. తాజాగా ఆస్తుల పంపకంపై విజయమ్మను, తనను కోర్టుకు లాగాలని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో షర్మిల పలు అంశాలను ప్రస్తావించారు.
ఐదేళ్లుగా ఆస్తుల పంపకం చేయకుండా జగన్‌మోహన్‌రెడ్డి నరకం చూపిస్తున్నాడని, 2019లో కుదుర్చుకున్న ఒప్పందం నేటికీ అమలు చేయలేదని ఆమె గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుండగా ముగ్గురు మనవరాళ్లు, మనవడికి ఆస్తులు సమానంగా పంచాలని చెప్పలేదా అని షర్మిల ప్రశ్నించారు. షర్మిలకు ఇంత వరకు ఆస్తులు బదిలీ చేయలేదని వైఎస్ అడిగినప్పుడు, పాపకు నీ తరవాత నాకన్నా గొప్పగా ఎవరు చూసుకుంటారు డాడ్ అన్న విషయం గుర్తులేదా? అంటూ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ అలా చెప్పలేదని ప్రమాణం చేయడానికి మీరు సిద్దమా అంటూ షర్మిల ప్రశ్నించారు.
భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్ ఆస్తులు జగన్ కష్టార్జితం అంటూ వైవీ సుబ్బారెడ్డి చెప్పడం మరింత క్షోభకు గురిచేసిందన్నారు. ఆస్తులు జగన్‌రెడ్డివి కాబట్టే ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పడంలో లాజిక్ లేదన్నారు. భారతి పేరుతో భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్ ఉన్నాయి, మరి ఆమె జైలుకు వెళ్లలేదుగా? అని షర్మిల ప్రశ్నించారు. ఆస్తులు ఎలా వచ్చాయనే దానిపై విచారించి కేసులు నమోదు చేస్తారని, అవి ఎవరి పేరుతో నిర్వహిస్తున్నారదేది ముఖ్యం కాదని షర్మిల తెలిపారు.
ఆస్తులు పంపకంపై జగన్‌మోహన్‌రెడ్డి ఘర్ ఘర్ కీ కహానీ అని చెప్పడం శోఛనీయమన్నారు. తండ్రిని కేసుల్లో ఇరికించిన వ్యక్తి, తల్లి, చెల్లిని కోర్టులకు లాగిన వ్యక్తి మీలో ఎవరైనా ఉన్నారా అంటూ షర్మిల మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. జగన్ కోసం తాను, విజయమ్మ శక్తికి మించి త్యాగం చేశామని షర్మిల గుర్తుచేశారు. జగన్ ఆదేశాలతోనే 3200 కి.మీ పాదయాత్ర చేసి పార్టీని బతికించినట్లు చెప్పారు. 2019 ఎన్నికల క్యాంపెయిన్ బైబై బాబు దేశంలోనే అతి పెద్ద హిట్ అయినట్లు పీకే తనకు స్వయంగా చెప్పారని షర్మిల గుర్తుచేశారు. ఆస్తుల ఇవ్వడం అనేది నాకు దానధర్మంగా రావాల్సింది కాదని,అది తన హక్కని గుర్తుచేశారు.