1947 అక్టోబర్ 26న మహారాజా హరిసింగ్ విలీన ఒప్పందంపై సంతకం చేయడంతో జమ్మూకశ్మీర్ భారత్‌లో అవిభాజ్య అంగమైపోయింది. 1947 భారత స్వతంత్ర చట్టం నిర్వచించిన ప్రకారం ఆయన తన హక్కును వినియోగించుకుని భారత్‌లో కశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేసాడు. ఆ చట్టం రాజసంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్ దేనిలో చేరాలో ఎంచుకునే అవకాశాన్నిచ్చింది. సంస్థానాధీశులకు ఆ హక్కును వినియోగించుకోడానికి ఒక్క అవకాశం మాత్రమే ఇవ్వబడింది.
భారత్‌లో చేరాలా లేక పాకిస్తాన్లో చేరాలా అని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది సంస్థానాధీశులకే తప్ప సంస్థానాలలోని ప్రజలకు అలాంటి హక్కు ఏమీ ఇవ్వలేదు. 550కి పైగా రాజసంస్థానాలు భారత్‌లో చేరిపోయాయి. వాటన్నింటికీ విలీన ఒప్పందం ఒకటే. ఆ ఒప్పందం మీదనే అవన్నీ సంతకాలు చేసాయి. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, జమ్మూకశ్మీర్ మినహా ఆ సంస్థానాలు అన్నింటితోనూ సంప్రదింపులు జరిపింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరే.
మహారాజా హరిసింగ్ కూడా అదే విలీన ఒప్పందం మీద సంతకం పెట్టారు. ఆయనకు ముందు ఎన్నో సంస్థానాల అధీశులు ఆ ఒప్పందం మీద సంతకం పెట్టారు. ఆ ఒప్పందాలన్నీ ఒకటే, సంస్థానాల పేర్లు మారాయంతే. హరిసింగ్ తర్వాత చాలా కాలానికి కూడా మరికొన్ని సంస్థానాలు విలీన ఒప్పందం మీద సంతకాలు చేసి భారతదేశంలో విలీనం అయ్యాయన్న మాటా నిజమే. అలాంటివాటిలో భోపాల్ రాజసంస్థానం ప్రధానమైనది. ఆ సంస్థానపు వారసత్వ పరిపాలకుడు నవాబ్ హమీదుల్లా ఖాన్ విలీన ఒప్పందం మీద 1949 ఏప్రిల్ 30న సంతకం చేసారు. అలా దేశానికి స్వతంత్రం వచ్చిన రెండేళ్ళ తర్వాత భోపాల్ భారత్‌లో విలీనమైంది.
విలీన ఒప్పందం మీద ఆఖర్లో సంతకాలు చేసిన రాజసంస్థానాల్లో ఒకటైన భోపాల్, ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంది. భోపాల్ జమ్మూకశ్మీర్ కంటె 18 నెలల తర్వాత సంతకం చేసినా, దానిగురించి ఏమీ అడగలేరు. ఎందుకంటే రాజసంస్థానాల అధీశులు 1947 ఆగస్టు 15 స్వతంత్ర దినానికంటె ముందు విలీన ఒప్పందం మీద సంతకం పెట్టితీరాలన్న నియమం ఏమీ లేదు, అలాగే వారు భారత్ లేదా పాకిస్తాన్లో చేరడానికి తుదిగడువు అంటూ నిశ్చయించిన తేదీ కూడా ఏమీ లేదు.
మహారాజా హరిసింగ్ విలీన ఒప్పందం మీద ఆలస్యంగా సంతకం చేసారని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలా ఆలస్యం చేయడం వల్లనే జమ్మూకశ్మీర్ విషయంలో సమస్య తలెత్తిందని చెబుతుంటారు. కానీ అది తప్పు. 1930లో లండన్‌లో భారతీయ సంస్థానాధీశుల రౌండ్‌టేబుల్ సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశంలో ఆయన తన భారతీయతను స్పష్టంగా ప్రదర్శించారు. అందుకే బ్రిటిష్ వారికి ఆయన నచ్చలేదు. అందుకే ఆయన రాజ్యంలో కొంతభాగాన్ని పాకిస్తాన్ లాగేసుకునేలా, బ్రిటిష్‌వారు ఆయనకు వ్యతిరేకంగా కుట్రచేసారు.
మహారాజా హరిసింగ్‌కు సమస్యలు కలిగించిన అంశం ఏంటంటే జమ్మూకశ్మీర్ ప్రాంతం భారత్, పాకిస్తాన్ రెండు ప్రాంతాలకూ దగ్గరగా ఉండడమే. ఆయన 1947 ఆగస్టులో పాకిస్తాన్‌తో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్నారు, భారత్‌తో కూడా అలాంటి ఒప్పందమే చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అలాంటి ఒప్పందం చేసుకోడానికి భారతదేశంలో ఎవరూ సిద్ధంగా లేరు. అప్పటి భారత ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ దానికి సుముఖంగా లేరు. మహారాజా హరిసింగ్ భారతదేశంలో చేరడానికి సందేహించారు అని చెప్పగల ఆధారం ఒక్కటి కూడా లేదు.
అందువల్ల, భారతదేశంలో జమ్మూకశ్మీర్ విలీనం పరిపూర్ణతను ప్రశ్నించడానికి లేదా తప్పుపట్టడానికీ ఎలాంటి కారణమూ లేదు.
ఇటీవల రాజ్యాంగ అధికరణం 370 రద్దు సందర్భంగా దాఖలైన పిటిషన్ల మీద తీర్పునిచ్చే సమయంలో సుప్రీంకోర్టు ఇలా స్పష్టంగా చెప్పింది. ‘‘దేశంలోని ఇతర రాష్ట్రాల హక్కులు, అధికారాల కంటె అదనంగా మరిన్న హక్కులు, అధికారాలూ ఉండడానికి జమ్మూకశ్మీర్‌కు వేరేగా ‘అంతర్గత సార్వభౌమాధికారం’ ఏదీ లేదు. విలీన ఒప్పందం మీద సంతకం చేసాక, 1949 నవంబర్ 25న యువరాజు కరణ్‌సింగ్ బహిరంగ ప్రకటన చేసాక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం ఏమీ లేదు. కరణ్ సింగ్ చేసిన ప్రకటన జమ్మూకశ్మీర్ సార్వభౌమాధికారాన్ని పరిపూర్ణంగా, సమగ్రంగా భారతదేశానికి అప్పగించివేసిన సంగతిని విస్పష్టం చేసింది.’’
కశ్మీర్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు భారతదేశంలో జమ్మూకశ్మీర్ విలీనం గురించి పదేపదే ప్రశ్నిస్తూ ఒక తప్పుడు ప్రచారాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తూంటారు. భారత్‌కు మల్లేనే జమ్మూకశ్మీర్‌కు కూడా ప్రత్యేక రాజ్యాంగం ఉందని వారు వాదిస్తూ ఉంటారు. ఆ సోకాల్డ్ ప్రత్యేక రాజ్యాంగం మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూసి అయినా వారి భ్రమలు తొలగించుకోవాలి. ‘‘జమ్మూకశ్మీర్ రాజ్యాంగం అన్నది ఆ రాష్ట్రానికి భారతదేశానికీ ఉన్న సంబంధాన్ని నిర్వచించడం కోసం మాత్రమే. ఆ సంబంధాన్ని విలీన ఒప్పందమూ, 1949 నవంబర్ ప్రకటనా, భారత రాజ్యాంగమూ ఇప్పటికే నిర్వచించేసాయి. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం అనేది అంతర్గత పరిపాలనకు సంబంధించినది మాత్రమే తప్ప సమాంతర రాజ్యాంగం కాదు. అది భారత రాజ్యాంగానికి లోబడి ఉండాల్సినది మాత్రమే.’’
జమ్మూకశ్మీర్ విలీనం గురించి చట్టబద్ధమైన పరిస్థితినీ, వాస్తవాలనూ పూర్తిగా సరిగ్గా వివరించాక, దాని చట్టబద్ధత గురించి ఎలాంటి అనుమానాలైనా పటాపంచలైపోతాయి. మహారాజా హరిసింగ్ విలీన ఒప్పందం మీద సంతకం చేసినప్పుడు తన రాజసంస్థానం మొత్తాన్నీ, దానిలోని అన్ని భాగాలనూ భారతదేశంలోనే విలీనం చేసినట్లు స్పష్టం చేసారు. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలను పాకిస్తాన్ యుద్ధంలో దొంగతనంగా లాక్కుపోయింది. నిజానికి విజయం సాధించే దిశలో ఉన్న భారత సైన్యాన్ని అప్పటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ అర్ధాంతరంగా వెనక్కు పిలిపించేయడం వల్ల మాత్రమే ఆ ప్రాంతాలను భారత్ వెనక్కు తెచ్చుకోలేకపోయింది. భవిష్యత్తులో ఏదో ఒకరోజు, ఇవాళ స్థూలంగా పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్ అని పిలుస్తున్న ప్రాంతాలు భారతదేశంలోకి వస్తాయి. అది తథ్యం. ఆరోజు, ఆ ప్రాంతాల గురించి 1994 ఫిబ్రవరి 22న పార్లమెంటులో చేసిన ఏకగ్రీవ తీర్మానం సాకారమవుతుంది.