కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు శివార్లలోని సురత్కల్ ప్రాంతంలో ఒక యువతి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దానికి కారణం ఆమె సోదరుడికి వచ్చిన సందేశమే. ‘‘నన్ను ప్రేమించమని నీ సోదరికి చెప్పు, లేదా నిన్ను 24 ముక్కలుగా నరికేస్తాను’’ అని ఆ మెసేజ్‌లో ఉంది. ఆ మెసేజ్ పెట్టింది ఓ ముస్లిం యువకుడని, తమ అమ్మాయిని అతను చాలాకాలంగా వేధిస్తున్నాడనీ ఆ కుటుంబం ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడు కొంతకాలం క్రితం బాధిత యువతి ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసాడు. దాన్నుంచే ఆమెకు ‘‘నాకు సహకరించు. లేదా నిన్ను 24 ముక్కలుగా నరికేస్తాను’’ అంటూ భయంకరమైన సందేశాలు పంపించాడు. ఆ వ్యక్తి తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నాడనీ, చాలాకాలంగా తనను అనుసరిస్తూ బెదిరిస్తున్నాడనీ బాధితురాలు వివరించింది.
యువతి ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసినందుకు, ఆమె సోదరుడికి బెదిరింపు సందేశాలు పంపినందుకూ నిందితుడి మీద సురత్కల్ పీఎస్‌లో కేసు నమోదయింది. ఆ పని చేసిన మొహమ్మద్ షరీక్ అనే యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసారు. అయితే తగిన సాక్ష్యాధారాలు లేవంటూ అతన్ని విడిచిపెట్టేసారు. అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసినా షరీక్ పద్ధతి మారలేదు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులనూ వేధిస్తూనే ఉన్నాడు.
ఆ మానసిక క్షోభ భరించలేక బాధితురాలు మొన్న గురువారం నాడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అంతకుముందు ఆమె ఒక లేఖ రాసింది. ‘‘ఆ యువకుడి వేధింపులు భరించలేకపోతున్నాను. పోలీసులు కూడా ఎలాంటి సాయం చేయలేకపోయారు. ఒక ముస్లిం చేతిలో అత్యాచారానికి గురయ్యే కంటె చచ్చిపోవడం మంచిది. షరీక్‌ని, అతని తల్లి నూర్జహాన్‌నీ వదిలిపెట్టవద్దు’’ అని ఆ లేఖలో పేర్కొంది. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, నిందితుణ్ణి స్వేచ్ఛగా వదిలేసారనీ, అందువల్లే తమ కుమార్తె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందనీ బాధితురాలి కుటుంబం వాపోయింది.
బాధితురాలి స్నేహితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మార్చి నెలలో బాధితురాలు ఒక దుకాణానికి వెళ్ళింది. దాని దగ్గరే నిందితుడి ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఈ అమ్మాయిని ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని ప్రతిపాదించారు. దానికి ఆ అమ్మాయి, ఆమె కుటుంబం నిరాకరించాయి. అప్పటినుంచీ వారికి ఈ వేధింపులు మొదలయ్యాయి.
నిందితుడు ఆమెకు రకరకాలుగా మెసేజ్‌లు పంపించేవాడు, ఆమె అతన్ని గూగుల్‌పే, ఇన్‌స్టాగ్రామ్‌లలో బ్లాక్ చేసింది. ఒకరోజు నిందితుడి సోదరి బాధితురాలి మొబైల్ తీసుకుని, అందులో ఫేస్‌బుక్ ఎకౌంట్ పాస్‌వర్డ్ మార్చేసింది. దాన్నుంచి అతను బెదిరింపు మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. బాధితురాలికి మాత్రమే కాక ఆమె కుటుంబ సభ్యులకు కూడా సందేశాలు పంపించాడు. ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను 24ముక్కలుగా నరికి చంపేస్తానంటూ ఆమె సోదరుడికి మెసేజ్‌లు పెట్టాడు.
పోలీసులు ఒకసారి అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేసినా తర్వాత వదిలిపెట్టేయడంతో కథ మొదటికి వచ్చింది. షరీక్ మళ్ళీ బాధితురాలిని, ఆమె కుటుంబాన్నీ బెదిరించడం కొనసాగించాడు. పోలీసులు వదిలేసాక షరీక్ తల్లి బాధితురాలిని అపహాస్యం చేయడం మొదలుపెట్టింది. ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి నిద్రమాత్రలు మింగేసింది’’ అని ఆమె స్నేహితురాలు చెప్పింది.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటూ స్థానికులు మండిపడ్డారు. నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతంలోని మహిళలు, యువతుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసారు. సైబర్ వేధింపులకు పాల్పడే వారిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది.
యువతి ఆత్మహత్యా ప్రయత్నం తర్వాత నిందితుడిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసామని సురత్కల్ పీఎస్ పోలీసులు చెప్పారు. బాధితురాలు ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెకు న్యాయం జరిపించాలని, షరీక్ నేరాన్ని సరిగ్గా నిరూపించి కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేస్తున్నారు.