శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తొమ్మిది నెలల నుంచి జరుగుతోన్న శిశు విక్రయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నరసరావుపేట నిమ్మతోట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నలుగురు సంతానం. మరోసారి గర్భందాల్చడంతో ఒక శిశువును విక్రయించాలని ఆసుపత్రిలోని నర్సును సంప్రదించింది. ఆడ శిశువును విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్‌కు లక్ష రూపాయలకు విక్రయించారు. శిశువును విక్రయించినందుకు ప్రభుత్వ ఆసుపత్రి నర్సు రూ.20 వేలు తీసుకుందని పోలీసులు తెలిపారు.
దీనిపై ఆకాశరామన్న పేరుతో ఓ వ్యక్తి కలెక్టర్‌కు రాసిన లేఖతో విషయం వెలుగులోకి వచ్చింది. శిశు విక్రయాలపై కలెక్టర్ పోలీసు విచారణకు ఆదేశించారు. పట్టణ సిఐ సుభాషిణి నిమ్మతోట ప్రాంతంలో విచారించి ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. గత 9 నెలల కాలంగా శిశు విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందులో ఐసీడీఎస్ సిబ్బంది సహా, చౌకధరల దుకాణం యజమాని కూడా ఉన్నట్లు గుర్తించారు.
గత కొంత కాలంగా నరసరావుపేట కేంద్రంగా శిశు విక్రయాలు సాగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు ఐసీడీఎస్ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు కూడా సహకరిస్తున్నారని గుర్తించారు. కమీషన్ల కోసం ప్రభుత్వ సిబ్బంది ఇలాంటి అరాచకాలకు దిగడం సంచలనంగా మారింది.
కొందరు మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రులకు కాన్పులకు వచ్చే వారి సమాచారం సేకరిస్తోన్న నర్సులు శిశువిక్రయాలకు దిగుతున్నారు. ఎక్కువ మంది ఆడ సంతానం ఉన్న వారిని, పేదలను గుర్తించి మధ్యవర్తుల ద్వారా పదుల సంఖ్యలో శిశువులను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.