క్రిప్టో కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెను ప్రమాదంగా పరిణమించాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన
పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ థింక్ ట్యాంక్‌లో ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. క్రిప్టో కరెన్సీ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగితే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని హెచ్చరించారు.
క్రిప్టో కరెన్సీతో ద్రవ్య లభ్యత,ఆర్థిక స్థిరత్వానికి పెనుప్రమాదం పొంచి ఉందని శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోల వల్ల ద్రవ్య సరఫరాపై కేంద్ర బ్యాంకులు నియంత్రణ కోల్పోయే ప్రమాదముందన్నారు. క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను శాసించేలా ఉండకూడదని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.
క్రిప్టో కరెన్సీతో ప్రమాదాలపైఅన్ని దేశాలకన్నా ముందే భారత్ ఆందోళన వ్యక్తం చేసినట్లు దాస్ గుర్తుచేశారు. జీ 20 సమావేశాల్లోనూ క్రిప్టో కరెన్సీ కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. పలు దేశాల్లో క్రిప్టో ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఆర్థిక వ్యవస్థపై క్రిప్టో కరెన్సీలు ఆధిపత్యం చలాయిస్తే, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని శక్తికాంతదాస్ తెలిపారు. ఇది ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థలు దివాళాతీస్తాయని ఆయన చెప్పారు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచంలో వేలాది క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నాయి. క్రిప్టోలపై నియంత్రణ లేకపోవడం, ఎక్కడ నుంచి వాటిని నడుపుతున్నారు, వాటి నియంత్రణ ఎవరి చేతుల్లో ఉందనే విషయాలు ఎవరికీ తెలియవు. కొన్ని సాఫ్ట్‌వేర్లను నమ్ముకుని వేల కోట్ల కరెన్సీని క్రిప్టోల్లోపెట్టుబడిపెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థలకు పెను సవాల్‌గా మారింది. మన దేశంలో క్రిప్టో కరెన్సీ ద్వారా చేసే లావాదేవీలపై కేంద్రం 30 శాతం పన్ను విధించింది.