ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు ఊరించి ఉసూరుమనిపించాయి. 2024 జనవరి నుంచి సెప్టెంబరు 27 వరకు పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.110 లక్షల కోట్లు పెరిగింది. సెప్టెంబరు 27 నాటికి మదుపరుల సంపద రూ.477 లక్షల కోట్ల రికార్డు స్థాయి చేరింది. అప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గడచిన 28 రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.41 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
సెప్టెంబరు మొదటి వారంలో రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. హరియాణ ఎన్నికల ఫలితాల తరవాత ఒక్క రోజులో రూ.7.5 లక్షల కోట్ల సంపద పెరిగింది. అది మినహా మార్కెట్ పుంజుకోలేదు. సెప్టెంబరు 27 నుంచి శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ విలువలో పెట్టుబడిదారులు ఏకంగా రూ.40.95 లక్షల కోట్లు కోల్పోయారు.
స్టాక్ మార్కెట్ల పతనానికి అనేక కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్ యుద్ధం ఏడాదిపైగా కొనసాగుతోంది. మరోవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. అభివృద్ధి చెందిన అమెరికా, చైనాలాంటి దేశాల్లో వృద్ధి రేటు దారుణంగా పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులు దూరంగా జరగడానికి కారణమైంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనా, వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహ పరిచాయి.దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి బయట పడుతున్నారు. మెటల్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్నారు. వాటి ధరలు దూసుకుపోతున్నాయి.