కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపు స్కామ్‌లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బిఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు శుక్రవారం అక్టోబర్ 25 నాడు ఇంటరాగేట్ చేసారు. పార్వతిని గుర్తుతెలియని ప్రదేశంలో రెండు గంటలకు పైగా ప్రశ్నించారు.
ముడా భూముల కేటాయింపు కేసు కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. భూముల కేటాయింపులో అక్రమ వ్యవహారాల కేసులో సీనియర్ రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మొదటి నిందితుడిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి రెండో నిందితురాలు. మైసూరులోని కీలక ప్రదేశాల్లో 14 స్థలాలను సిద్దరామయ్య భార్య పార్వతి చట్టవిరుద్ధంగా సంపాదించుకున్నారన్నది ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ. తనది కాని భూమిని ప్రభుత్వానికి ఇచ్చినందుకు పరిహారంగా పార్వతికి ఈ స్థలాలను ఇస్తున్నారని సమాచారం. దాంతో తమకు నచ్చిన వారికి భూములు కట్టబెట్టడం కోసం ఏకంగా ముడా విధివిధానాలనే తారుమారు చేసారని, పక్షపాత ధోరణితో వ్యవహరించారనీ ఆరోపణలు వచ్చాయి.
కర్ణాటక లోకాయుక్త, ఎస్పీ టిజె ఉదేష్ పర్యవేక్షణలో పార్వతీ సిద్దరామయ్యను ఇంటరాగేట్ చేసారు. ఆ విషయంలో గోప్యత పాటించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఈ కేసులో ఇతర నిందితులైన మల్లికార్జున స్వామి, దేవరాజును ఇప్పటికే ఇంటరాగేట్ చేసారు. పార్వతికి మాత్రం సమన్లు నిశ్శబ్దంగా జారీ చేసారు, ప్రజల దృష్టి మరల్చి ఇంటరాగేషన్‌కు తీసుకువెళ్ళారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… పార్వతిని లోకాయుక్త అధికారులు ముడాకు ఆమె పెట్టుకున్న దరఖాస్తుల గురించి ప్రశ్నించారట. పార్వతి తనవిగా చెప్పుకున్న భూములను ముడా స్వాధీనం చేసుకుంటే, వాటికి పరిహారంగా తాను అడిగిన స్థలాలనే ఇవ్వాలని చేసిన డిమాండ్ల గురించి అడిగారట. తాను కేవలం సాధారణంగా చేసే పరిహార చెల్లింపుల గురించి మాత్రమే అడిగానని, అందులో తన భర్త లేదా కొడుకు ప్రమేయం ఏమీ లేదని పార్వతి చెప్పారట. వేర్వేరు డాక్యుమెంట్లలో ఆమె సంతకాల్లో తేడాల గురించి అడిగినప్పుడు తను తరచుగా సంతకాలు చేయననీ, అందువల్లే వాటిలో తేడాలు వచ్చి ఉంటాయనీ చెప్పారట.
మైసూరు తాలూకా కాసరె గ్రామంలో 3.16 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతిగా పార్వతికి రూ.56కోట్లు విలువ చేసే 14 స్థలాలు కేటాయించారు. నిజానికి ఆ మూడెకరాల భూమి చట్టబద్ధంగా పార్వతిది కానేకాదు, ఆమెకు ఆమె సోదరుడు ఆ భూమిని వేరొకరి నుంచి కొనుగోలు చేసి కానుకగా ఇచ్చాడు. ఈ అక్రమ కేటాయింపుల వ్యవహారంలో రాజకీయ నాయకులకు, స్థానిక అధికారులకు మధ్య, లాభాలు చెరిసగం పంచుకోవాలనే ఒప్పందం ఉందని సమాచారం.
ఈ వ్యవహారంలో సిద్దరామయ్యకు వ్యతిరేకంగా దర్యాప్తు జరిపించాలని గవర్నర్ ఆదేశించారు. ఆ ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. ఆ మరునాడు సెప్టెంబర్ 24న ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు. మరోవైపు ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ వ్యవహారం కూడా ఉండి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది.
ఈ గొడవ తర్వాత పార్వతి ఆ 14ప్లాట్లనూ ప్రభుత్వానికి వెనక్కిచ్చేసారు. అలా ఇచ్చేయడంలో రహస్యంగా వ్యవహరించడం కూడా అనుమానాలకు దారితీసింది. తప్పుచేసి దాన్ని దిద్దుకోడానికి ప్రయత్నిస్తున్నారన్న సందేహాలకు తావిచ్చింది. మరోవైపు, కేసును దర్యాప్తు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్దరామయ్య ఒక పిటిషన్ ఫైల్ చేసారు. దానిమీద డివిజనల్ బెంచ్ నిర్ణయం వచ్చేవరకూ ఎదురుచూస్తామని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర ప్రకటించారు. ఇది తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ఆఖరి ప్రయత్నంగా భావిస్తున్నారు.
ఈ కేసులో చట్టప్రక్రియను తారుమారు చేయడానికి ముఖ్యమంత్రి తన పరపతిని, ప్రతిష్ఠనూ ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలనీ బీజేపీ డిమాండ్ చేసింది. మొత్తం మీద ఈ ముడా భూముల కేటాయింపు స్కామ్ సిద్దరామయ్యకు పదవీగండం తెచ్చిపెట్టేలాగే ఉంది.