ఏపీలో కరెంటు బిల్లుల బాధుడుకు రంగం సిద్దమైంది. 2022- 23లో అప్పటి వైసీపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్‌పై వచ్చే నెల నుంచి ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది.మొత్తం రూ.6072 కోట్లను 15 నెలలపాటు వసూలు చేయనున్నారు. 2026 జనవరి వరకు కరెంటు బిల్లుల్లో అదనంగా ఇంధన ఛార్జీలు వసూలు చేయనున్నారు.
2022 – 23లో డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారు. దాదాపు రూ. 8 వేల కోట్లకుపైగా ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలకు తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. పది రోజుల కిందట ప్రజాభిప్రాయం తీసుకున్న నియంత్రణ మండలి తాజాగా రూ.6072 కోట్ల వసూలుకు అనుమతించింది.
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి వ్యవహరిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆయన పదవి ముగియనుంది. పదవి ముగిసే సమయంలో ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సమావేశంలోనూ హామీ ఇచ్చారు. అయితే తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి ఇంధన సర్దుబాటు కింద రూ.6072 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలకు అనుమతించారు. దీన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా? నేరుగా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.