ఉత్తరప్రదేశ్‌లో గత వారంరోజుల వ్యవధిలో మూడుచోట్ల క్రైస్తవ మతమార్పిడి రాకెట్లు బైటపడ్డాయి. హిందూ స్త్రీపురుషులను, చిన్నపిల్లలను కూడా మభ్యపెట్టి మతం మారుస్తున్న సంఘటనలు సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కొంతమందిని అరెస్టు చేసారు. అయితే మతం మారిపోయిన వారు మళ్ళీ హిందుత్వంలోకి వస్తారా? రికార్డుల్లో హిందువులుగా చూపించుకుంటూ దానివల్ల అందే లాభాలు అందుకుంటూ జీవితంలో మాత్రం క్రైస్తవమతాన్ని అనుసరిస్తూ ఉండిపోతారా? అనే సందేహాలు అలాగే ఉండిపోయాయి.
1. రాయబరేలీ కేసు:
గురుబక్ష్‌గంజ్ పీఎస్ పరిధిలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసారు. బర్దార్ గ్రామంలో అమాయకులైన మహిళలు, మైనర్ పిల్లలతో పాటు హిందూ పురుషులను మతం మారుస్తున్నారు. రాజేష్ కుమార్ అలియాస్ డేవిడ్, అతని కొడుకు ఈశ్వర్ ప్రజలను వాళ్ళవాళ్ళ దీర్ఘకాలిక రోగాలు సైతం ప్రభువు మహిమతో నయమైపోతాయంటూ మభ్యపెట్టి మతం మారుస్తున్నారు. దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు డేవిడ్‌ను అరెస్ట్ చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధం ఆర్డినెన్స్ 2024 కింద కేసు నమోదు చేసారు. ఆ కేసులో మరికొందరి ప్రమేయం ఉందంటున్న పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
2. మీరట్ కేసు:
మీరట్ వికాస్‌నగర్‌లో పోలీసులు అక్టోబర్ 20న ఒక క్రైస్తవ మతమార్పిడి ముఠాను పట్టుకున్నారు. ఒక అద్దె ఇంట్లో సుమారు 40మంది ఆడవాళ్ళు, పిల్లలను సమావేశపరిచి, వారిని మతం మారుస్తున్నారు. కొంతకాలంగా జరుగుతున్న ఆ వ్యవహారం గురించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కర్వాచౌత్ పండుగ రోజు ఆ ఇంట్లో సోదాలు చేపట్టారు. కేరళకు చెందిన బిజు అనే పాస్టర్, అతని భార్య సుమారు మూడు నెలల క్రితం ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పటినుంచీ మతమార్పిడి పనులు మొదలుపెట్టారు. స్థానిక ప్రజలను సమీకరించి, వారిని ప్రలోభపరిచి మల్టీలెవెల్ మార్కెటింగ్ తరహాలో మతమార్పిడులు చేస్తున్నారు. పెళ్ళిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తామని, వ్యాపారాలకు మూలధనం సమకూరుస్తామని, అనారోగ్యాలను పవిత్రజలంతో నయం చేస్తామనీ చెబుతూ దానికి ప్రతిగా మతం మారుస్తున్నారు. వారి కూటమి సమావేశాల్లో హిందూమతాన్ని దూషిస్తూ, హిందూ ఆచార సంప్రదాయాలను నిందిస్తూ అమాయక ప్రజలను మభ్యపెట్టి మతం మారుస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పాస్టర్ బిజు, అతని భార్య, వారి సహాయకుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
3. ఆజంగఢ్ కేసు:
అక్టోబర్ 20నాడే ఆజంగఢ్ జిల్లాలోని మిరియా రేధా గ్రామంలో జరుగుతున్న సామూహిక మతమార్పిడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాజారాం యాదవ్ అనే వ్యక్తి హిందూ దేవీదేవతల చిహ్నాలు, బొమ్మలు, విగ్రహాలను తీసిపారేయాలనీ, వాటిబదులు క్రైస్తవ ప్రతిమలను పెట్టుకుని పూజించాలని ప్రజలను ఉసిగొలుపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ ప్రాంతంలో మతమార్పిడి కార్యకలాపాలకు ఆ గ్రామమే చిరునామాగా మారిందని స్థానికులు వివరించారు.
మిషనరీల వ్యూహాలు:
అమాయకులైన హిందువులను ఏదోవిధంగా ప్రలోభపెట్టి మతం మార్చే ‘సాఫ్ట్ కన్వర్షన్’ ప్రక్రియ చాలా పాతది. దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు హిందువులను మతం మార్చే ప్రక్రియ 18వ శతాబ్దం నుంచీ కొనసాగుతోంది. ఇంక మానవత్వం పేరిట మదర్ తెరెసా 20వ శతాబ్దంలో చేసిన మతమార్పిడులు తెలిసినవే. దానికి వారు అనుసరించే వ్యూహాలు ఆందోళనకరంగా ఉన్నాయి.
మతమార్పిడి వ్యూహాల్లో ప్రధానమైనది ‘రైస్ బ్యాగ్ టాక్టిక్’. మతం మారితే సరుకులిస్తాం, డబ్బులిస్తాం అంటూ పేద హిందువులను ప్రలోభపెట్టే పద్ధతి చాలాకాలం నుంచి అమల్లో ఉంది.
1. మిషనరీలు సాధారణంగా క్రైస్తవ సాహిత్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. తద్వారా అమాయకుల మనసుల్లో క్రైస్తవ మతమే గొప్పది అనే విశ్వాసం కలగజేసి, వారిని మతం మారేలా ప్రలోభపెడతారు.
2. చాలామంది మిషనరీలు సాధారణంగా స్వర్గం, నరకం గురించి ఊదరగొడతారు. క్రైస్తవుడు కానివారికి స్వర్గంలో చోటు ఉండదని, వారు నరకంలో కఠోరమైన శిక్షలు అనుభవిస్తారనీ భయపెడతారు. వ్యక్తిగత సమస్యలతో బాధపడే వారిని, సమాజంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నవారినీ ఆకట్టుకుంటారు.
3. విద్య, వైద్యం ఉచితంగానో లేక నామమాత్రపు రుసుముకో అందించడం ద్వారా హిందువులను క్రైస్తవంలోకి మారడానికి ప్రలోభపెడతారు. ప్రత్యేకించి ఈ పద్ధతి నేటికీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఫలితాలనిస్తోంది.
4. గిరిజన ప్రాంతాల్లో ప్రతీవారం క్రమం తప్పకుండా ప్రార్థనా కూటముల పేరిట సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అమాయక గిరిజన ప్రజలకు సేవ చేస్తున్నామనే ముసుగులో వారి ఆదరణను చూరగొంటారు. ఆ తర్వాత క్రమంగా వారిని క్రైస్తవంలోకి మార్చే తమ అసలైన అజెండాను అమలు చేస్తారు. ఆ క్రమంలో హిందూమతానికీ, క్రైస్తవానికీ పెద్ద తేడా ఏమీ లేదంటూ మసిపూసి మారేడుకాయ చేస్తారు.
5. మహిమలు, అద్భుతాలతో ఆరోగ్యం బాగుపడిపోతుందని ప్రలోభపెడతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి, వారి రోగాలు నయమైపోతాయనే ఆశ కల్పిస్తారు. ప్రభువును నమ్ముకుంటే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని, దైవకృప వారిపై వర్షిస్తుందనీ నమ్మబలుకుతారు. సరైన వైద్యసహాయం అందని ప్రజలను ఇటువంటి హామీలతో ఆకట్టుకుంటారు.
6. ఆర్థిక సహకారంతో ప్రలోభపెడుతుంటారు. చాలా తరచుగా వస్తు సహాయం చేస్తుంటారు. దానాలు, విరాళాలు సేకరించి వాటిలో కొంతభాగాన్ని పేద ప్రజలకు అందించి, మతం మారితే అటువంటి ఆర్థిక సహాయం ఎప్పుడూ దొరుకుతూ ఉంటుందంటూ ఆకట్టుకుంటారు.
ఇలా కుయుక్తులతో మతమార్పిడులు చేయడం నైతికం కాదు, కానీ హిందుత్వాన్ని నశింపజేయడమే లక్ష్యంగా పనిచేసే మిషనరీ మాఫియా అలాంటి నైతిక విషయాలను పట్టించుకోదు. పైగా, రికార్డుల్లో హిందువులుగానే చూపుకుంటూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవించవచ్చునని, ఆచరణలో మాత్రం క్రైస్తవాన్ని పాటించాలనీ చెబుతుంటారు. ఆ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా భారతీయ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హక్కులను లాగేసుకుంటూ ఉంటారు.