ఉచిత ఇసుక పాలసీ అమలులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనరేజి రుసుం రద్దు చేస్తున్నట్టు తెలిపిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ జీవో జారీ చేశారు.
ఈ నెల 21న జరిగిన కేబినెట్ భేటీలో ఇసుక విధానంపై తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా ఈ జీవో పలు విషయాలు స్పష్టం చేశారు. సీనరేజి ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు తీసుకున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇకపై సీనరేజి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే నిర్మాణ అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు అని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
మరోవైపు ఇసుక అక్రమ రవాణా కట్టడికి విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జీపీఎస్, చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలు ఏర్పాటు చేయనుంది.
ఇసుక లభ్యత పెంచేలా పాలసీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇసుక లభ్యం కాని జిల్లాల్లో స్టాక్ యార్డులు ఏర్పాటు చేయబోతున్నారు.