పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ప్రతీకారదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం రాత్రి టెహ్రాన్‌పై భీకర దాడులు చేసింది. సైనిక స్థావరాలు, ఆయుధాగారాలు, క్షిపణుల తయారీ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి స్పష్టం చేశారు.
రెండు వారాలుగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. అక్టోబరు 1న ఇరాన్ చేసిన క్షిపణి దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఆ తరవాత హెజ్బొల్లా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రజలను రక్షించుకునే హక్కు, బాధ్యత తమకు ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు గుర్తుచేశారు.
ఇరాన్‌పై దాడి విషయంలో తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికా రక్షణ కేంద్రాల నుంచి ఈ దాడులు జరగడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా అత్యాధునిక రక్షణ వ్యవస్థను అందించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం అమెరికాకు చెందిన ఆయుధాలను ఉపయోగించడంపై గతంలోనే ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ ఆయుధాల సరఫరా నిలిపివేసిన తరవాత ఐడీఎఫ్ ఇతర మార్గాలను అన్వేషిస్తోంది.
గత ఏడాది పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై భీకరదాడులు చేసి 1400 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన యుద్ధం పలుదేశాలకు విస్తరించింది. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్బొల్లాతోపాటు, ఐసిస్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.ఖతర్, ఈజిప్ట్ చేస్తోన్న సంధి ప్రయత్నాలు ఫలించలేదు.