ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటుకు అనుమతిస్తూ, నిధులు కూడా మంజూరు చేసిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆనందోత్సవాలు నిర్వహించారు. బిజెపి నేతలు ఆనందం పంచుకుంటూ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసారు, మిఠాయిలు పంచిపెట్టారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రూ.2545 కోట్లతో అమరావతి నుండి నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఆ రైల్వే లైన్ వెంబడి 25 లక్షల మొక్కలను నాటే అవకాశం ఉందని చెప్పారు.
‘‘డబుల్ ఇంజన్ సర్కార్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని మేం మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం. అలాగే ఈరోజు అమరావతికి సుమారు 57కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు చేసారు. రాష్ట్రంలో పెద్దయెత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. విజయవాడలో ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా బీజేపీ ప్రభుత్వ ఘనతే’’ అని పురందరేశ్వరి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొత్తలోనే కేంద్రం 25వేల కోట్లు ఇచ్చిందని, ఆ విషయాన్ని బడ్జెట్లో కూడా ప్రకటించారనీ పురందరేశ్వరి గుర్తుచేసారు. విశాఖపట్నం రైల్వేజోన్ నిర్మాణం కోసం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గత ప్రభుత్వాన్ని కోరినా, వారిచ్చిన భూమి అనుకూలంగా లేనందున ప్రాజెక్టు సాగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్థలం మంజూరుకు సిద్ధంగా ఉన్నందున నాలుగు మాసాల్లో రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.
ఆ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బిట్రాశివన్నారాయణ, పాకా వెంకట సత్యనారాయణ, పాతూరి నాగభూషణం, షేక్ బాజీ, యామినీ శర్మ, అడ్డూరి శ్రీరాం, ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, కిలారు దిలీప్, శ్రీధర్, మువ్వల వెంకట సుబ్బయ్య, బొడ్డు నాగలక్ష్మి, నరసరాజు, గాయత్రి, బొమ్మదేవర రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.