నటుడు అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నంద్యాలలో అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలంటూ నటుడు అల్లు అర్జున్, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. నవంబరు 6న తుది తీర్పు వెలువరించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నటుడు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రమోహన్‌రెడ్డి మద్దతు పలికేందుకు వచ్చారు. కోడ్ అమల్లో ఉండగా ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. అయినా నంద్యాల పట్టణ శివారు నుంచి భారీ ర్యాలీ చేశారు. దీంతో అప్పట్లోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతోపాటు పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్లను ఉల్లంఘించిన కేసులు నటుడు అల్లు అర్జున్, నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్‌రెడ్డిపై నమోదు చేశారు. కావాలని ర్యాలీ చేయలేదని అభిమానులు ఊహించని విధంగా వచ్చారంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గత వారం ఒకసారి హైకోర్టులో విచారణకు రాగా, ఇవాళ మరోసారి విచారించారు. నవంబరు 6న తీర్పు వెలువరించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి ఆదేశించారు.