స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహ పరచడంతో పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వారాంతంలో ఇవాళ సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లు పైగా కోల్పోయింది. నిఫ్టీ 300 పాయింట్లుపైగా నష్టపోయింది. చివరకు మార్కెట్ ముగిసే చివరి గంటలో స్వల్పంగా కోలుకున్నాయి. స్టాక్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 662 పాయింట్ల నష్టంతో 79402 వద్ద ముగిసింది. నిఫ్టీ 218 నష్టంతో 24180 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో అన్ని షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు 18 శాతం పడిపోయింది. మహింద్రా అండ్ మహింద్రా, ఐసిఐసిఐ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా ఎన్నికల వేళ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అయ్యే అవకాశాలున్నాయంటూ వస్తోన్న సర్వేలతో స్టాక్ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి.
డాలరు స్వల్పంగా బలపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84.09 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధర స్వల్పంగా తగ్గి 74 డాలర్లు పరిమితమైంది. బంగారం ధర పరుగులు పెడుతోంది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర తాజాగా 2732 అమెరికా డాలర్లకు చేరింది. కిలో వెండి లక్షా 2500 రూపాయలు దాటిపోయింది.