తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో రెండు కీలక ప్రాంతాలైన దెమ్‌చోక్, దెప్సాంగ్ వద్ద మోహరించిన బలగాలను భారత్, చైనా ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభమైంది.
ఇరుపక్షాల మధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం భారత బలగాలు తమ సామగ్రిని ఆ రెండు ప్రదేశాల నుంచీ తరలిస్తున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ దగ్గర నాలుగేళ్ళుగా కొనసాగుతున్న సైనిక గస్తీ విషయంలో చైనాతో ఒప్పందం కుదిరిందని భారతదేశం అక్టోబర్ 21న ప్రకటించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ సమానత్వం, పరస్పర భద్రత అనే నియమాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాలూ ఏకాభిప్రాయం సాధించాయని చెప్పారు. నిరంతరం చర్చల ప్రక్రియ కొనసాగించడం వల్లనే పరిష్కారాలు లభిస్తాయనడానికి ఇది నిదర్శనమని హర్షం వ్యక్తంచేసారు. రక్షణ, దౌత్య స్థాయుల్లో జరిగిన చర్చల్లో స్థూలంగా ఏకాభిప్రాయం కుదిరిందని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 23 బుధవారం నాడు బ్రిక్స్ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్యా గస్తీ ఏర్పాట్ల గురించి ఒప్పందం కుదరడాన్ని స్వాగతించారు. సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరతలను నెలకొల్పడమే ప్రధానంగా ఉండాలని, ద్వైపాక్షిక సంబంధాలకు పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక కావాలనీ చెప్పారు. భారత-చైనా సంబంధాలు కేవలం ఇరుదేశాల ప్రజలకే కాక, ప్రపంచ శాంతి సుస్థిరత ప్రగతికి అత్యవసరమని ఆయన అన్నారు.
తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దుల సమస్య 2020లో చైనా మిలటరీ చర్యలతో మొదలైంది. దాంతో ఇరుదేశాల మధ్యా ఉద్రిక్తతలు ముదిరాయి, ఇరుదేశాల సంబంధాలూ బాగా దెబ్బతిన్నాయి కూడా.