రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ ఇవాళ మొదలైంది. ఉత్తరప్రదేశ్ మథురలోని గౌ గ్రామ్ పర్‌ఖమ్‌లో ఉన్న దీనదయాళ్ గో విజ్ఞాన్ అనుసంధాన్ ఏవం ప్రశిక్షణ్ కేంద్రంలోని నవధా ఆడిటోరియంలో ఈ రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళే భారతమాతకు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది.
నేటి కార్యక్రమంలో మొదట ఇటీవల తుదిశ్వాస విడిచిన జైపూర్‌కు చెందిన రాఘవాచార్య మహరాజ్, పద్మవిభూషణ్ రతన్‌టాటా, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి, మాజీ విదేశాంగమంత్రి కె నట్వర్‌సింగ్, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ, అడ్మిరల్ రాందాస్ తదితర ప్రముఖులకు నివాళులర్పించారు. సమావేశం మొదట్లో, ఈ యేడాది మార్చిలో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రొసీడింగ్స్‌ను ఆమోదించారు.
ఈరోజు, రేపు జరిగే కార్యక్రమంలో, సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ తన విజయదశమి ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలపై విస్తృతంగా చర్చిస్తారు. వాటిని అమల్లోకి తీసుకొచ్చే ప్రణాళికలను రచిస్తామని, దాంతో పాటు సమకాలీన దేశ వ్యవహారాలను చర్చిస్తామనీ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర కుమార్ వెల్లడించారు.
ప్రతినిధి సభలో నిర్ణయించిన వార్షిక ప్రణాళికను సమీక్షిస్తారు. సంఘ కార్యకలాపాల విస్తరణ పనులను విహంగవీక్షణం చేస్తారు. సమాజ అభ్యున్నతి కోసం సంఘం చేపట్టిన పంచ పరివర్తన కార్యక్రమం గురించి చర్చ జరుగుతుంది. అందులో సమాజంలో మార్పు తేగల ఐదు ప్రధాన అంశాలు ఉంటాయి. అవి సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధనం, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ, పౌరవిధులు. ఈ ఐదు అంశాలనూ సమాజంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం ద్వారా ఆదర్శ భారతాన్ని సాధించడం గురించి చర్చ జరుగుతుంది.
ఈ సమావేశంలో సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబళేతో పాటు ఆరుగురు సహ సర్‌కార్యవాహలు డాక్టర్ కృష్ణగోపాల్, శ్రీముకుంద, అరుణ్‌కుమార్, రాందత్ చక్రధర్, అలోక్ కుమార్, అతుల్ లిమాయే పాల్గొంటున్నారు. వారితోపాటు దేశంలోని 11 క్షేత్రాలు, 46 ప్రాంతాలకు చెందిన ప్రచారక్‌లు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలతో కలిపి మొత్తం 393 మంది సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.