అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చి వాటిలో కొన్నింటినైనా నెరవేర్చలేక అవస్థలు పడుతున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, చిరుద్యోగుల పొట్ట కొడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారం తయారు చేసి వడ్డించే 49,855మంది కిచెన్ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వలేకపోతోంది. కనీసం రెండు నెలల నుంచీ వారికి జీతాలు అందలేదు. కొన్ని జిల్లాల్లోనైతే జూన్ నెల నుంచీ ఇప్పటివరకూ గౌరవ వేతనాలు చెల్లించలేదు. దానికి కారణం నిధులు లేకపోవడమేనని తెలుస్తోంది.
అక్టోబర్ 23న కిచెన్ స్టాఫ్ సమావేశం జరిగింది. ఆ భేటీలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేవారి సమస్యల గురించి చర్చ జరిగింది. ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన కరవు ఉన్నప్పుడు సైతం సేవలందించామనీ, వాటి చెల్లింపులు ఇప్పటివరకూ జరగలేదనీ వారు ఆవేదన వ్యక్తం చేసారు. జీతాలు చెల్లించలేకపోవడం కార్మికుల ఆర్థిక కష్టాలను బైటపెట్టడం మాత్రమే కాదు, ఏకంగా రాష్ట్రప్రభుత్వపు వివిధ సంక్షేమ పథకాల అమలునే ప్రశ్నిస్తోంది.
గౌరవ వేతనాల కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.12.16 కోట్ల గ్రాంటును విడుదల చేయాలి. ఈ పథకం అమలుకు నిధుల్లో 60శాతం కేంద్రప్రభుత్వం, మిగతా 40శాతం రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ లెక్క ప్రకారం కేంద్రం 7.29 కోట్లు, తమిళనాడు రాష్ట్రప్రభుత్వం 4.86కోట్లు చెల్లించాలి. ఏప్రిల్, ఆగస్టు నెలల్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అటు కేంద్రం నుంచీ, ఇటు రాష్ట్రం నుంచీ ఎలాంటి నిధులూ రాలేదు. ఈ ఆలస్యం వల్ల ఆ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు.
బ్యాంకు ఖాతాల్లో పాన్, ఆధార్ కార్డు లింక్ చేయడంలో సాంకేతిక సమస్యలు కూడా జీతాలు ఇవ్వడంలో ఆలస్యానికి ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే నిధులు లేకపోవడమే అసలైన సమస్య అని తెలుస్తోంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు నిధులు విడుదల చేయలేదు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు మొదటి కిస్తీ డబ్బులు సైతం ఇప్పటివరకూ చెల్లించలేదు.
క్షీరభాగ్య యోజన కింద కేంద్రం రూ.303 కోట్ల గ్రాంటు ఇచ్చింది. అందులోనుంచి, కిచెన్‌స్టాఫ్ జీతాల చెల్లింపు కోసం రూ.123.73 కోట్లు విడుదలకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇంకా మంజూరు చేయలేదు. ఆ విజ్ఞప్తి ఇంకా ఆర్థిక శాఖ దగ్గరే పెండింగ్‌లో ఉంది. అంతేకాదు, కిచెన్‌స్టాఫ్‌లో 60ఏళ్ళు నిండి, సర్వీసు నుంచి తప్పించినవారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవలసి ఉంది. దానికి కూడా ప్రభుత్వం జి.ఒ ఆమోదించింది, కానీ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. రాష్ట్రంలో ఉపయెన్నికల కారణంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, అందువల్ల ఆ ఉత్తర్వుల అమలు జాప్యమవుతోందనీ ప్రభుత్వం చెబుతోంది.
నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం, పారదర్శకత లేని పనితీరుతో ప్రభుత్వపు ఆర్థిక స్థిరత్వం మీద, దాని ప్రాధాన్యాల మీద సందేహాలు నెలకొన్నాయి. జీతాలు చెల్లించకపోవడం, అవినీతి, నిధుల గోల్‌మాల్ వంటి ఆరోపణలతో ఇప్పుడు జరగవలసిన ఉపయెన్నికల్లో సైతం రాష్ట్రప్రభుత్వానికి గడ్డుపరిస్థితి నెలకొంది.