దీపావళి నుంచి ఏపీలో ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి మనోహర్, ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ఉంటాయని వెల్లడించారు . ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి వినియోగదారులు బుక్ చేసుకోవచ్చని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ. 894 కోట్లు అందజేస్తామన్న మంత్రి, ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయిల్ కంపెనీలకు చెక్కు పంపిణీ చేస్తామన్నారు. సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుందన్నారు.
బుకింగ్ అయిన 24 నుంచి 48 గంటల్లో సిలిండర్ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పట్టణాల్లో అయితే కేవలం 24 గంటల్లోనే డెలివరీ ఉంటుందన్నారు . సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ జరుగుతుందన్నారు.