తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఇటీవల కాలంలో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు భక్తులు మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు మెట్ల మార్గంలో వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది. వారికి ఏ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా టీటీడీ తెలిపింది.
మధుమేహం, హైబీపీ, గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు మెట్ల మార్గంలో రావద్దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా మెట్ల మార్గాన్ని ఎంచుకోవద్దని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు వారి జబ్బులకు సంబంధించిన రోజువారీ మందులు వెంట తెచ్చుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
మెట్ల మార్గంలో తిరుమల చేరుకునే వారికి 1500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల వద్ద వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. తిరుమలలో అశ్విని ఆసుపత్రి 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసరంగా డయాలసిస్ అవసరం అయిన వారికి తిరుపతి స్విమ్స్‌లో వైద్యులను 24 గంటలూ అందుబాటులో ఉంచినట్లు అధికారులు ప్రకటించారు.
తిరుమల కొండలు సముద్రమట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉండటంతో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, మెట్లు ఎక్కే వారికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు గుర్తుచేశారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారు మెట్ల మార్గంలో రాకపోవడమే మంచిదని టీటీడీ తెలిపింది.