తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం ఆదేశాల మేరకు గతవారం రెండు దేవాలయాలను కూల్చివేసారు. భక్తుల ఆందోళనలను, హిందూ సంస్థల నిరసనలనూ పట్టించుకోకుండా గుడులను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోంది. పొల్లాచిలోని శక్తి వినాయగర్ ఆలయాన్ని, మదురైలోని కళ్యాణ వినాయగర్ ఆలయాన్నీ కూల్చివేయడంపై హిందువుల మండిపడుతున్నారు.
పొల్లాచిలో రైల్వేస్టేషన్ దగ్గర శక్తి వినాయగర్ దేవాలయం ఉంది. అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించారు. దాంతో స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఒక ఫ్లైఓవర్ నిర్మించాలి. దానికి సుమారు 6కోట్లు ఖర్చువుతుంది. స్టేషన్ ప్రవేశద్వారం దగ్గర గుడి ఉంది, దాంతో అక్కడ ట్రాఫిక్ ఎక్కువై ఇబ్బందులు కలుగుతున్నాయి, అందువల్ల ఆ గుడిని తొలగించాలి అని రైల్వే అధికారులు నిర్ణయించారు.
విషయం తెలిసిన స్థానిక భక్తులు, హిందూ మున్నని సంస్థ సభ్యులు గుడి దగ్గర ఆందోళన నిర్వహించారు. గుడి వల్ల ప్రజారవాణాకు ఇబ్బంది లేదని, అక్కడ రోజూ మూడుసార్లు పూజలు జరుగుతుంటాయని, పెద్దసంఖ్యలో నగరంలోని ప్రజలు, రైల్వే ప్రయాణికులు దైవదర్శనం చేసుకుంటారనీ వివరించి, అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.
‘‘గుడిని కూల్చవద్దంటూ మేం పాలక్కాడ్ రైల్వే డివిజన్ అధికారులకు, పొల్లాచి సబ్‌కలెక్టర్‌కు పిటిషన్లు పెట్టాం. మా భక్తుల విశ్వాసాలను, మనోభావాలను వాళ్ళు పట్టించుకోలేదు. పైగా, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసే చవితి నాడు గుడిని కూలగొట్టేసారు. స్థానికంగా ఆ గుడికి అమిత ప్రజాదరణ ఉంది. దానివల్ల ప్రజారవాణాకు ఎలాంటి సమస్యా లేదు. ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారు గుడిని కూల్చేసారు’’ అని హిందూ మున్నని ప్రతినిధి శివకుమార్ చెప్పారు.
హిందూ మున్నని, భారతీయ హనుమాన్ సేన, వివేకానంద సేవా సమితి తదితర స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రైల్వే అధికారులు గుడికున్న విద్యుత్ కనెక్షన్లు తొలగించారు, తర్వాత గుడిని కూల్చేసారు.
మరో సంఘటనలో మదురైలో అధికారులు కళ్యాణ వినాయగర్ కోవెలను కూల్చేసారు. అది నగరంలో ప్రఖ్యాతి గడించిన తిరుపరాంకుండ్రం మురుగన్ ఆలయానికి దగ్గరలో సన్నిధి వీధిలో ఉంది. మురుగన్ ఆలయం చుట్టూ పరిక్రమ మార్గంలో ఆక్రమణలను తొలగించడానికి వినాయకుడి గుడిని కూల్చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. అక్కడ కూడా హిందూ మున్నని సభ్యులు, భక్తులు గుడి కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. అధికారులతో చర్చలు జరిపారు. వారు గుడిని మళ్ళీ కడతామని హామీ ఇచ్చి, ముందు కూలగొట్టేసారు. ఆలయంలోని మూలమూర్తులను. ఇతర పవిత్ర సామగ్రిని తొలగించడానికి సమయం ఇచ్చారు. మరో కొత్త స్థలం దొరికే వరకూ వినాయకుడి మూర్తిని తాత్కాలికంగా ఒక చెట్టుకిందకి మార్చారు.
అధికారులు హిందూ దేవాలయాలను పడగొట్టడంలో ఉత్సాహం చూపిస్తున్నారని భక్తులు ఆవేదన పడుతున్నారు. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాస్థలాల విషయంలో మాత్రం స్పందించడం లేదని మండిపడుతున్నారు. అక్రమంగా కట్టిన ఒక మసీదును కూల్చే ప్రయత్నాన్ని ముస్లిములు విజయవంతంగా అడ్డుకున్న సంగతిని ఉదాహరిస్తున్నారు.
చెన్నైలోని కోయంబేడు ప్రాంతంలో మజీద్-ఎ-హిదయా మసీదును అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మించారు. దాన్ని తొలగించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. దాంతో ఈ యేడాది జూన్‌లో దాన్ని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అక్రమ మసీదును తొలగించకూడదంటూ వందల సంఖ్యలో ముస్లిములు రహదారుల మీదకు వచ్చి ఆందోళనలు మొదలుపెట్టారు. దాంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలినే ముస్లిములతో సమావేశాలు నిర్వహించాడు. మసీదు తొలగింపును నివారించడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతామని వారికి హామీ ఇచ్చాడు.
హిందువుల దేవాలయాలను తొలగించేట అటువంటి ఉత్తర్వుల విషయంలో మాత్రం అధికారులు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఏమాత్రం స్పందించడం లేదంటూ సగటు హిందూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడేళ్ళలో 250 దేవాలయాలను ఎంపిక చేసి మరీ ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసారని హిందూ మున్నని నాయకులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా కట్టిన మసీదులు, చర్చిలను తొలగించాలంటూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేసినా వాటిని బేఖాతరు చేస్తున్నారనీ, గుడులను మాత్రం లక్ష్యం చేసుకుని ఉద్దేశపూర్వకంగా, విచక్షణారహితంగా కూలగొట్టారని ఆవేదన చెందుతున్నారు.