దానా తుపాను తీరం దాటింది. గురువారం అర్థరాత్రి నుంచి మొదలై శుక్రవారం ఉదయానికి పూర్తిగా తుపాను తీరం దాటింది. ఒడిషాలోని ధమ్రా, భిత్తర్‌కనిక జాతీయ పార్కు మధ్య తుపాను తీరందాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. భీకర గాలులకు భారీ వృక్షాలు నేలవాలాయి. గడచిన 24 గంటల్లో ఒడిషా, బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో 8 నుంచి 21 సెం.మీ వర్షపాతం నమోదైంది.
దానా తుపాను ప్రభావం ఒడిషాలోని రెండు జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 6 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భువనేశ్వర్, కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయాలను శుక్రవారం రాత్రి వరకు మూసివేయాలని నిర్ణయించారు. చెన్నై, కోల్‌కతా మార్గంలో నడిచే 400పైగా రైళ్లను రద్దు చేశారు.
తుపాను బాధితులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు సంస్థ రంగంలోకి దిగింది. రహదారులపై వేలాది చెట్లు కూలిపోవడంతో రవాణా నిలిచిపోయింది. భద్రక్, కేంద్రపార జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది చెట్లు తొలగించే పనులు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం జరుగుతోంది.
తుపాను ప్రభావంతో ఒడిషా, బెంగాల్‌తోపాటు ఉత్తరకోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర హెచ్చరించింది. సముద్ర తీరం వెంట 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాద ముందని, మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.