హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణానికి చెందిన నాగచైతన్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కోకాపేటలోని విరూపాక్ష మెన్స్ హాస్టల్ 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగచైతన్య విరూపాక్ష హాస్టల్లో ఉండటం లేదని దాని నిర్వాహకులు తెలిపారు. అతను హాస్టల్కు ఎందుకు వచ్చాడో తెలియడం లేదని వారు చెప్పారు.నాగచైతన్య సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగచైతన్యకు ఇటీవల అప్పులు బాగా పెరిగిపోయాయని పోలీసుల విచారణలో తేలింది. అయితే అప్పులు ఎందుకు చేశాడమే విషయం వారు వెల్లడించలేదు. మృతుడి సోదరి నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించారు. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పులు లక్షల్లో పెరిగిపోవడంతో తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపిన సమాచారం ద్వారా తెలుస్తోంది.
నాగ చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రదేశాన్ని నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. అతడి వద్ద లభించిన సమాచారం మేరకు సికింద్రాబాద్లో నివాసం ఉంటోన్న మృతుడి సోదరికి సమాచారం అందించారు. ఆమె నుంచి పోలీసులు కొంత సమాచారం రాబట్టారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.