ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణజన్మభూమి కేసులో షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ వేసిన రీకాల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న కృష్ణజన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి చాలా కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ సమీకరించి ఒకేసారి విచారించాలంటూ న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు కమిటీ రీకాల్ పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆ పిటిషన్‌ని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
ఈ వివాదానికి సంబంధించి 15 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపేసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉత్తర్వుల ప్రకారం విచారించాలని న్యాయస్థానం 2023 జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని దావాలనూ కన్సాలిడేట్ చేయాలంటూ హిందూ పక్షం తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. అన్ని కేసులనూ కలిపి విచారించడం వల్ల వ్యవహారం మరింత సరళంగా, స్పష్టంగా ఉంటుందని వారు వాదించారు. ఆ వాదనతో కోర్టు ఏకీభవించింది.
కోర్టు ఆదేశాలను సైతం వ్యతిరేకిస్తూ షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ రీకాల్ పిటిషన్ వేసింది. కేసులన్నిటినీ కన్సాలిడేట్ చేయడం వల్ల ప్రతీ కేసునూ విడివిడిగా వాదించగల తమ సామర్థ్యాన్ని అణచివేసినట్లవుతుందని మసీదు కమిటీ వాదించింది.
అయితే మసీదు కమిటీ వేసిన రీకాల్ పిటిషన్‌ను కోర్టు నిస్సందేహంగా త్రోసిపుచ్చింది. కేసుల కన్సాలిడేషన్ నిర్ణయాన్ని మొదట 2023 ఆగస్టు 1న ప్రకటించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదని ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జైన్ గుర్తుచేసారు. తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి మసీదు కమిటీకి బోలెడన్ని అవకాశాలు ఇచ్చామనీ, అప్పుడు కమిటీ ఆ అవకాశాలను వాడుకోలేదనీ తేల్చిచెప్పారు. హిందూ భక్తులు వేసిన కేసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ మసీదు కమిటీ గతంలో ఇచ్చిన దరఖాస్తులను సైతం గత ఆగస్టులోనే డిస్మిస్ చేసిన సంగతిని జస్టిస్ జైన్ గుర్తుచేసారు.
ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 6న జరగనుంది. అప్పుడు ఈ కేసుకు సంబంధించి హిందూ భక్తులు వేసిన 18 దావాలను పరిగణనలోకి తీసుకుంటారు.