మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నాయకుడు శరద్ పవార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎన్నికల చిహ్నమైన గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అది తుది నిర్ణయం కాదనీ, ఆ విషయాన్ని అజిత్ పవార్ వర్గం తమ ఎన్నికల ప్రకటనల్లో స్పష్టంగా ప్రకటించాలనీ ఆదేశించింది.
ఎన్‌సిపి రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ గుర్తించింది. పార్టీ పేరును, గుర్తును అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది. దాన్ని సవాల్ చేస్తూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటికింకా లోక్‌సభ ఎన్నికలు జరగలేదు. అందువల్ల ఇరు పక్షాలకూ చెరొక కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం కోర్టును కోరింది. అప్పుడు సుప్రీంకోర్టు తాత్కాలికంగా తీర్పునిచ్చింది.
మరికొన్ని వారాల్లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ శరద్ పవార్ వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు కూడా అజిత్ పవార్ వర్గానికే గడియారం దక్కింది.