విమానాలకు బెదిరింపు సందేశాలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా దుండగులు వెనక్కు తగ్గడం లేదు. గురువారం ఒక్క రోజే 70 బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. అంతర్జాతీయ విమానాలకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ప్రయాణీకుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని విమానయాన సంస్థలు ప్రకటించాయి. బెదిరింపు కాల్స్ వచ్చిన విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.
బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు కేంద్రం చట్టాలను తీసుకు రావాలని యోచిస్తోందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరావు రాంమ్మోహన్ నాయుడు తెలిపారు. బెదిరింపులకు పాల్పడే వారికి జీవితఖైదు విధించేలా చట్టాలను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. విమానాల్లో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడే వారిని, జీవిత కాలం నో ఫ్లై జోన్‌లో చేర్చుతున్నారు. విదేశాల నుంచి బెదిరింపులు పంపిన వారికి కూడా ఈ చట్టం వర్తింపజేయనున్నారు. ఎక్స్ వేదికగా బెదిరింపులు రావడంపై కేంద్రం ఆ సంస్థను వివరణ కోరింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులకు ఎక్స్ వేదికగా మారిందని హెచ్చరించింది.