భారత్తో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు స్వదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షంతో పాటు ఆయన సొంత లిబరల్ పార్టీ ఎంపీలు సైతం ట్రూడో రాజీనామాకు పట్టుపడుతున్నారు.
కెనడా పార్లమెంటు భవనంలో జరిగిన లిబరల్ పార్టీ ప్రజాప్రతినిధుల అంతర్గత సమావేశంలో పలువురు ఎంపీలు ట్రూడోపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. కెనడా పార్లమెంటు (హౌస్ ఆఫ్ కామన్స్) సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశాలు వారానికి ఒకసారి జరుగుతుంటాయి. ఆ క్రమంలో భాగంగా ఈ బుధవారం జరిగిన సమావేశంలో ఎంపీలు ట్రూడోపై తమ అసంతృప్తిని ఆయన ముఖం మీదనే వెళ్ళగక్కారు.
ట్రూడోకు సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోంది. ఆయన తన భవిష్యత్తును నిర్ణయించుకోడానికి అసంతృప్త ఎంపీలు అక్టోబర్ 28 వరకూ గడువు ఇచ్చారు. ఆలోగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసారు. అయితే ఆ గడువులోగా ట్రూడో స్పందించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయన్నదాని గురించి వారేమీ ప్రకటించలేదు. లిబరల్ పార్టీ నాయత్వం నుంచి ట్రూడో వైదొలగాలంటూ డిమాండ్ చేస్తూ 24మంది ఎంపీలు లేఖ మీద సంతకాలు చేసారని సమాచారం.
బ్రిటిష్ కొలంబియా ప్రాంత ఎంపీ పాట్రిక్ వీలర్, ట్రూడో రాజీనామా కోరుతూ ఒక డాక్యుమెంట్ సమర్పించారు. అందులో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయకుండా ఉండడం వల్ల వారి డెమొక్రటిక్ పార్టీ ఎలా పునరుజ్జీవం పొందిందో, కెనడాలోని లిబరల్ పార్టీ కూడా అలాగే జాగృతమవుతుందని వారు వాదించారు.
మూడు గంటల పాటు సాగిన సమావేశంలో ప్రతీ ఎంపీకి రెండు నిమిషాల సమయం కేటాయించారు. వారిలో సుమారు 20మంది ఎంపీలు, రాబోయే ఎన్నికలకు ముందే ట్రూడో పదవినుంచి తప్పుకోవాలని కోరారు. అదే సమయంలో ట్రూడోకు మద్దతుగా కూడా చాలామంది ఎంపీలు నిలిచారు.
ట్రూడో క్యాబినెట్లోని మంత్రులెవరూ ఆయన రాజీనామా చేయాలని కోరలేదు, కానీ ట్రూడోపై కొందరు ఎంపీల అసంతృప్తిని గౌరవించాలంటూ ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడడం గమనార్హం.
కెనడాలో ఈ రాజకీయ విభేదాలకు ప్రధాన కారణం భారత్ – కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులే అని తెలుస్తోంది. గతేడాది కెనడా పార్లమెంటులో ప్రసంగిస్తూ, ప్రధాని ట్రూడో ఆ దేశ పౌరుడైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారతదేశం హస్తముందని ఆరోపించారు. అప్పటినుంచీ ఇరుదేశాల మధ్య సంబంధాలూ దిగజారుతూ వస్తున్నాయి. ట్రూడో ఆరోపణలు అసంబద్ధాలనీ, భారత వ్యతిరేక అతివాద, ఉగ్రవాద శక్తులకు కెనడా ఆశ్రయం ఇస్తోందనీ అంటూ భారత్ ఆ ఆరోపణలను త్రోసిపుచ్చింది. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు సాకుతో భారత్కు చెందిన దౌత్యాధికారులను కెనడా కొద్దిరోజుల క్రితమే బహిష్కరించింది. విచిత్రమేంటంటే, నిజ్జర్ హత్య విషయంలో తాను చేసిన ఆరోపణలకు ఆధారాలేమీ లేవని ట్రూడో స్వయంగా వెల్లడించారు.
తను అధికారంలో కొనసాగడానికి ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతు మీద ఆధారపడుతున్నందునే ట్రూడో భారత్ మీద ఆరోపణలు చేస్తున్నారనీ, ఆయన చర్యల వల్ల ఇరుదేశాల సంబంధాలూ పాడవుతున్నాయంటూ కెనడాలో సైతం అసంతృప్తి రాజుకుంటోంది.