ఉక్కుమనిషిగా పేరు గడించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి చేసిన సేవల గౌరవార్థం, ఆయన 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పటేల్ సాధించిన విజయాలు, ఆయన చాటిన ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా ఆ వేడుకలు జరుగుతాయి.
ఆ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో ట్వీట్ ద్వారా ప్రకటించారు. ‘‘సర్దార్ర పటేల్ సుదీర్ఘమైన వారసత్వం, ఆయన దార్శనికత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒకటైన మన దేశ వ్యవస్థ ఏర్పాటు వెనుక ఉన్నాయి. కశ్మీర్ నుంచి లక్షద్వీప్ వరకూ భారతదేశాన్ని ఏకీకరించడంలో ఆయన పోషించిన కీలక పాత్ర శాశ్వతంగా మిగిలిపోతుంది. దేశానికి ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవల గౌరవార్థం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పటేల్ 150వ జయంతిని రెండేళ్ళ పాటు అంటే 2024 నుంచి 2026 వరకూ దేశవ్యాప్తంగా వేడుక జరుపుతుంది. పటేల్ సాధించిన ఘన విజయాలకు నిదర్శనంగా, ఆయన సాధించిన ఐక్యతకు సాక్షిగా ఆ వేడుక ఉంటుంది’’ అని అమిత్ షా వెల్లడించారు.
సర్దార్ పటేల్ జయంతి అక్టోబర్ 31. ఆరోజును భారతదేశం జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటుంది.