జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. వలసకార్మికులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిగా పోలీసులు నిర్ధారించారు. గడిచిన వారంలో ఈ తరహా దాడి జరగడం ఇది మూడోసారి .
త్రాల్‌లోని బటాగుండ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది.ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన 19 ఏళ్ల శుభమ్ కుమార్, ఉపాధి కోసం జమ్మూ వెళ్ళగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలో అక్టోబర్ 20న ఓ నిర్మాణ స్థలంలో ఉన్న కూలీలపై ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో వైద్యుడుతో పాటు ఆరుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ లోని లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో ఓ యువకుడిని ఉగ్రవాదులు హతమార్చారు.