మహారాష్ట్ర పుణే పోలీస్ అధికారులు రంజన్‌గావ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 21మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసారు. వారిలో 15మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు. వారు భారత్‌లోకి చొరబడి నకిలీ డాక్యుమెంట్లతో పౌరులుగా చెలామణీ అయిపోతున్నారు. ఆ కేసులో పదిమందికి కోర్టు పోలీస్ కస్టడీ విధించిందని జిల్లా ఎస్‌పి పంకజ్ దేశ్‌ముఖ్ తెలియజేసారు.
పుణే ఏటీఎస్ అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అక్టోబర్ 21న సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం నిందితులు భారతదేశంలో నివసిస్తుండడానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి వెల్లడించారు.
‘‘రంజన్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఒక నేరాన్ని విచారించే క్రమంలో మాకు కొంతమంది బంగ్లాదేశీయుల గురించి తెలిసింది. వారిని విచారించగా వారు అక్రమంగా భారత్‌లోకి చొరబడి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని తేలింది. వారెందుకు మన దేశంలో నివసిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారిలో ఎక్కువమంది రోజుకూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ దశలో వారిగురించి వ్యాఖ్యలు చేయడం తొందరపాటు కాగలదు. రెండుమూడు రోజుల దర్యాప్తు తర్వాత వారి ఉద్దేశమేమిటో తెలిసే అవకాశముంది’’ అని ఎస్‌పి చెప్పారు.
పోలీసులు వారినుంచి 8 నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఒక ఓటర్ ఐడీ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు బంగ్లాదేశీయులను భారత్‌లోకి అక్రమంగా తీసుకొస్తున్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.