శారాదాపీఠం భూమి వెనక్కి…
దీపావళి నుంచి అర్హులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలీండర్లు అందజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే, 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమ అయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లకు బదులు ప్రతీ నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడనుంది.
ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు కూడా మంత్రివర్గం సుముఖత తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.
దేవాలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంపునకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖకు చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్, భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయించారు.